సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఇళ్ల పట్టాల పంపిణీపై కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలి. గత వీడియో కాన్ఫరెన్స్ నాటికి 834 కేసులు ఉంటే.. ఇవాళ్టికి ఆ సంఖ్య 758కి తగ్గింది. తద్వారా 8 వేల మందికి మేలు జరిగింది. పెండింగ్‌లో ఉన్న మిగతా కేసుల పరిష్కారంపై కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు దృష్టి పెట్టాలి. ఏజీతో నేను రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాను. దేవుడి దయవల్ల నెల రోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాను. పెండింగ్ కేసుల్లో 395 కేసులపై తాత్కాలిక స్టేలు ఉన్నాయి. వీటిపై కూడా దృష్టి పెడితే, పేదలకు మేలు జరుగుతుంది.
సాక్షి, అమరావతి: డిసెంబర్ 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ పథకం వల్ల దాదాపు 67 లక్షల మంది పేదలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఇళ్లు, స్థలాలు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి ఉందని, కనీసం రుణాలు తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 1980 నుంచి 2011 వరకు ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అవకాశం ఇస్తున్నామని చెప్పారు. ఆ ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయని, బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవచ్చని, తద్వారా పేదలకు చాలా మంచి జరుగుతుందన్నారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్‌లో చేయాలని అధికారులను ఆదేశించారు.
స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు, పేదల ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లు, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌పై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వన్‌టైం సెటిల్‌మెంట్ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేశామన్నారు. ఈ పథకం గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో అమలు అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన డేటాను అప్‌లోడ్ చేసేలా చూడాలని, వచ్చే 90 రోజుల్లో ఈ మేరకు అన్ని పనులూ పూర్తి కావాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్)పై ఇటీవలే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని, దీనిపై అందరికీ అవగాహన కలిగించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
ఓటీఎస్ వర్తింపు ఇలా..
► పట్టా తీసుకున్న వారు, ఇల్లు కట్టుకున్న వారు.. హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి రూరల్ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే ఓటీఎస్ వర్తిస్తుంది.
► పట్టా ఉండి, ఇల్లు కట్టుకుని, హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుని... ఎవరికై నా ఇంటిని అమ్మేసి ఉంటే.. రూరల్ ప్రాంతంలో రూ.20 వేలు, మునిసిపాలిటీల్లో రూ.30 వేలు, కార్పొరేషన్లలో రూ.40 వేలు జమ చేసి ఓటీఎస్ కింద లబ్ధి పొందవచ్చు.
► పట్టా మాత్రమే తీసుకుని.. రుణాలు తీసుకోకుండా.. వాళ్లే ఆ స్థలంలో ఉంటే.. ఇలాంటి కేటగిరీ వారికి రూ.10తో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. పట్టా తీసుకున్న వారు ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మినప్పుడు.. ఆ స్థలంలో ఇతరులు అక్కడ ఇల్లు కట్టుకుని ఉంటే.. అలాంటి వారికి రూరల్ ప్రాంతంలో రూ.10 వేలు, మునిసిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్‌లో రూ.20 వేలు జమచేస్తే వారికి ఈ పథకం వర్తిస్తుంది.
లే–అవుట్లు, ప్లాట్ల వారీగా లబ్ధిదారులు మ్యాపింగ్
► లే అవుట్లు, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశాం. మనం తయారు చేసిన యాప్‌లో ఈ వివరాలన్నింటినీ ఉంచాలి. లే అవుట్ల వారీగా వివరాలు తెలియజేయాలి. దీనివల్ల మిగిలిన ప్లాట్లను కొత్త లబ్ధిదారులకు కేటాయించడానికి వీలు కలుగుతుంది.
► మిగిలిపోయిన 12.6 శాతం మ్యాపింగ్ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తి చేయాలి. విజయనగరం, తూర్పుగోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి.
జూన్–డిసెంబర్‌లో మంజూరు
► పెన్షన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల పట్టాలతో పాటు మనం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి మిస్ అయిన వారిపై దృష్టి పెట్టాలి. వీరందరికీ ప్రతి ఏడాది జూన్, డిసెంబర్‌లో ఆ ప్రయోజనాలందిస్తాం. ఈలోగా వెరిఫికేషన్లు పూర్తి చేయాలి.
► ఇళ్ల పట్టాల కోసం పెట్టుకున్న దరఖాస్తుల్లో పెండింగులో ఉన్న వాటి వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. వీరికి ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45,600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10,851 మందికి డిసెంబర్‌లో పట్టాలు అందించాలి. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది. తాజాగా విడుదల చేసిన జీవోపై దృష్టి పెట్టండి.
► భూ బదిలీ ద్వారా భూములను సేకరించడంపై దృష్టి పెట్టండి. ఇళ్ల పట్టాలకు అవసరమైన భూమిని వారి దగ్గర తీసుకోవడం, దానికి బదులుగా వేరేచోట ప్రభుత్వ భూమి ఇవ్వగలగడంపై దృష్టి పెట్టాలి.
అక్టోబర్ 25కు బేస్‌మెంట్‌లెవల్ పైకి వచ్చేలా చర్యలు
► పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఇప్పటి వరకు 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్ అయ్యాయి. అక్టోబర్ 25 నాటికల్లా బేస్‌మెంట్ లెవల్ పైకి తీసుకువచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
► చిత్తూరు, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆయా కలెక్టర్లకు అభినందనలు. మిగిలిన జిల్లాల కలెక్టర్లు కూడా దృష్టి పెట్టాలి.
ఇటుకల తయారీ
► వెయ్యి ప్లాట్ల కన్నా ఎక్కువ ఉన్న చోట... అక్కడే ఇటుకల తయారీని ప్రారంభించాలి. దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తాయి. సిమెంటు సబ్సిడీ రేటుపై ఇస్తున్నాం. ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం. రీచ్ 40 కి.మీ కన్నా ఎక్కువ దూరం ఉంటే.. మనమే రవాణా ఖర్చులు భరిస్తున్నాం.
► ఇళ్ల నిర్మాణం వల్ల మెటల్ ధరలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. ధరలను నియంత్రణలో ఉంచితే అనుకున్న ఖర్చుకే ఇళ్లు కట్టవచ్చు. ఆప్షన్ –3 ఎంచుకున్న ప్రాంతాల్లో 1.75 లక్షలకే ఇంటి నిర్మాణం పూర్తవుతుందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను.
► ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేలా మాట్లాడుతున్నాం. బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారికి రుణాలు అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
లే అవుట్లు సందర్శించాలి
► కలెక్టర్లు వారానికి ఒకసారి ఇళ్ల నిర్మాణంపై సంబంధిత శాఖలతో కలిసి సమీక్ష చేయాలి. మునిసిపాలిటీ స్థాయిలో, మండలాల స్థాయిలో, పంచాయతీల స్థాయిలో, లే అవుట్ స్థాయిల్లో కూడా సంబంధిత అధికారులు ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్ష చేయాలి. అప్పుడే ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరుగుతుంది.
► కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు ప్రతి వారం ఒక లే అవుట్‌ను పర్యవేక్షించాలి. జాయింట్ కలెక్టర్ హౌసింగ్, సబ్ కలెక్టర్, ఆర్డీఓలు ప్రతి వారంలో నాలుగు సార్లు లే అవుట్లలో క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలి. అప్పుడే సమస్యలు ఏంటో తెలుస్తాయి.
► పెద్ద లే అవుట్లలో నిర్మాణ సామగ్రిని ఉంచడానికి, సైట్ ఆఫీసుల కోసం ఉపాధి హామీ పనుల కింద గోడౌన్లను నిర్మించాలి.
లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు
► ఆప్షన్–3ని ఎంపిక చేసుకున్న వారి ఇళ్ల పనులు అక్టోబర్ 25 నుంచి మొదలు పెట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారులతో కలిపి గ్రూపులు ఏర్పాటు చేయాలి. స్థానికంగా ఉన్న మేస్త్రీలతో వీరిని అటాచ్ చేయాలి.
► ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తి కావాలి. లే అవుట్లలో నీటి వసతిని ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలి. మిగిలిపోయిన లే అవుట్లలో విద్యుత్తు, నీటి వసతిని కల్పించడంపై దృష్టి పెట్టాలి.
► సిమెంటు, బ్రిక్స్, ఐరన్, మెటల్.. వీటి వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌పై 3.79 లక్షల మంది ఆసక్తి
► టిడ్కో ఇళ్లకు సంబంధించి కొత్త లబ్ధిదారుల ఎంపిక పూర్తి కావాలి. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్‌లో ఎంఐజీ ప్లాట్లకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి. 3.79 లక్షల మంది వీటిపై ఆసక్తి చూపారు. అధికారులు ఇప్పటి దాకా 1,001 ఎకరాలను గుర్తించారు. మరో 812 ఎకరాలకు సంబంధించి వెరిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి.
► మార్గదర్శకాలకు అనుగుణంగా భూములను వెంటనే గుర్తించాలి. రెగ్యులర్‌గా దీనిపై సమీక్ష చేయాలి. అవసరమైన చోట భూసేకరణ, లేదా ల్యాండ్ పూలింగ్ చేయాలి. ప్రభుత్వ భూములను కూడా ఈ పథకం కోసం గుర్తించాలి. మంచి ప్రాంతాల్లో భూములు ఉండేలా చూసుకోవాలి.
► అప్పుడే న్యాయ వివాదాల్లేకుండా, క్లియర్ టైటిల్‌తో సరసమైన ధరలకే మధ్యతరగతి ప్రజలకు ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఈ లే అవుట్లలో ఏర్పాటు చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ కేబుల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్మార్ట్ స్ట్రీట్ లైట్లు తదితర మౌలిక సదుపాయాలతో, మంచి ప్రమాణాలతో లే అవుట్లు వారికి అందుబాటులోకి వస్తాయి. తద్వారా చాలా మందికి ప్రయోజనం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment