సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని మధ్య తరగతి ఆదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్(ఎంఐజీ) లేఅవుట్ల పనులు ప్రారంభమయ్యాయి. మార్కెట్ ధర కంటే తక్కువకు ప్లాట్లను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ అధికారులు లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ప్రకాశం జిల్లాలోని కందుకూరు, వైఎస్సార్ కడప జిల్లాలోని రాయచోటి, నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణాల్లో లే అవుట్లను వేసి, డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో అన్ని వసతులతో ప్లాట్లను సిద్ధం చేశారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కర్నూలు, గుంటూరు, ఏలూరు అర్బన్ అథారిటీ పరిధిలో మరికొన్ని లే అవుట్లను సిద్ధం చేస్తున్నారు. ఇవి వివిధ దశల్లో ఉన్నట్టు ఎంఐజీ ప్రాజెక్టు ఎండీ పి.బసంత్ కుమార్ సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. తొలివిడతలో వీటన్నింటినీ సిద్ధం చేసి..సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. అంతకు ముందే ప్లాట్ల బుకింగ్‌కు అనుగుణంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
అర్బన్ అథారిటీ పరిధిలో..
► జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ప్రాజెక్టులకు సంబంధించి సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భూముల్లోనే లే అవుట్లు వేస్తున్నారు. అందుకోసం ఆయా జిల్లాల్లోని అర్బన్ అథారిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను తీసుకుంటున్నారు.
►ఒక లే అవుట్ వేసేందుకు ఒకేచోట 50 లేదా అంతకంటే ఎక్కువ ఎకరాల భూమి ఉన్నచోట ప్లాట్లు వేసేందుకు అనువుగా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ధర్మవరం, కందుకూరు, రాయచోటి, కావలిలో వేగంగా ప్లాట్లు సిద్ధమయ్యాయి.
►ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట ప్రభుత్వ పరిశ్రమలకు చెందిన భూములను తీసుకుని, అందుకయ్యే వ్యయాన్ని ఆయా పరిశ్రమలకు చెల్లించనున్నారు. అవసరమైన చోట ప్రైవేటు భూములను సైతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం జీఓ నంబర్ 76 నిబంధనలకు లోబడి తీసుకుంటారు. వాటికి ఒప్పందం కుదిరిన వెంటనే నగదు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు.
వచ్చే నెలాఖరుకు మరికొన్ని ప్రాంతాల్లో..
►మధ్యాదాయ వర్గాలకు ఉద్దేశించిన ప్లాట్లకు ప్రజల్లో బాగా డిమాండ్ ఉండడంతో ప్రాజెక్టులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలో 150 ఎకరాలు, విజయనగరం జిల్లా డెంకాడ, బొండపల్లి వద్ద 40 ఎకరాలు, విశాఖ జిల్లా పాలవలస వద్ద 93 ఎకరాలు, జీఎస్ అగ్రహారం, రామవరంలో 269 ఎకరాల్లో జనవరి చివరి నాటికి ప్లాట్లు సిద్ధం కానున్నాయి.
►కృష్ణా, గుంటూరు జిల్లాల్లో, ఏలూరు సమీపంలో అధికారులు భూములను పరిశీలించి అంచనాలు రూపొందించారు. కాగా, ఇప్పటికే సేకరించిన భూముల్లో జనవరి చివరి నాటికి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ అనుమతితో ప్లాట్లు సిద్ధం చేయనున్నారు.
► సేకరించిన భూముల్లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 50% భూమిని అన్ని రకాల మౌలిక వసతులకు కేటాయించి, మిగిలిన స్థలంలో మాత్రమే ప్లాట్లు వేస్తున్నారు. ఈ ప్లాట్లు వేయడానికి అయిన ఖర్చు మేరకే ప్రజలకు అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment