సాక్షి, అమరావతి: పేదలకు సొంత ఇంటి నిర్మాణాలను వచ్చే నెల నుంచి వేగవంతం చేసేందుకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే 15.60 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ల మంజూరు పత్రాలను కూడా అందించింది. పేదల ఇంటి నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గృహనిర్మాణ శాఖ అధికారులతో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నారు.
ముఖ్యంగా నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణాలను వేగవంతం చేయాలని స్పష్టంగా చెబుతున్నారు. లబ్ధిదారులకు స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకు అందేలా చేయాలని సీఎం ఆదేశించడంతో ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయిలో రూ.100 కోట్ల వరకు పరికరాలు కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటవుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ప్రస్తుతం విద్యుత్‌తోపాటు నీటి వసతి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కాలనీల్లో రోడ్ల వెడల్పును 20 అడుగులకు తగ్గకుండా చూస్తున్నారు.
ఇళ్ల నిర్మాణాల్లో సచివాలయాల సిబ్బందిదే కీలకపాత్ర
ఇళ్ల నిర్మాణంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. లబ్ధిదారులతో బ్యాంకు ఖాతాలు తెరిపించడం మొదలు, ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి బిల్లులు చెల్లించడం, ఇతర అవసరమైన పనులు చేయడంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వలంటీర్లు లబ్ధిదారులకు సహకారమందిస్తారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి సమీక్షలు
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. మొదట శ్రీకాకుళం జిల్లా నుంచి సమీక్షలు ప్రారంభిస్తాం. జిల్లాల పర్యటనలో భాగంగా క్షేత్ర స్థాయికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడతాం. ప్రతి 25 ఇళ్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి.. నిర్మాణ బాధ్యతలను ఒకరికి అప్పగించి.. నిరంతరం పర్యవేక్షిస్తాం. నిర్మాణాల కోసం సిమెంట్, స్టీల్ సిద్ధంగా ఉంది. ఇటుకలను స్థానికంగానే కొనుగోలు చేయనున్నాం.
– చెరుకువాడ శ్రీరంగనాథరాజు, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment