
మహారాణిపేట (విశాఖ దక్షిణ): అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించింది.
ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.