
వెంకటగిరి రూరల్: తన భార్యను గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని బాధితుడు దట్టం గురవయ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని కథనం.. వెంకటగిరి రూరల్ మండలం, చిన్నన్నపేటకు చెందిన దట్టం గురవయ్య, తిరుమలమ్మ(30) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు వెంకటగిరి పట్టణంలోని ఓ కాంప్లెక్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 1వ తేదీన కూలి పనులకని వెళ్లిన తిరుమలమ్మ మళ్లీ ఇంటికి రాలేదు.
వారం రోజులుగా వెదికినా ఫలితం లేదన్నారు. అదే గ్రామానికి చెందిన పుట్ట గురవయ్య తన భార్యతో సన్నిహితంగా ఉండేవాడని, అతనే తన భార్యను కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాక గురవయ్య పార్లపల్లి గ్రామానికి చెందిన మరికొందరితో పరిచయం ఏర్పాటు చేసుకుని మహిళలను ట్రాప్ చేస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు.