కుమార్తె శాన్వితతో కలిసి భర్త ఇంటి ఎదుట నిరీక్షిస్తున్న శ్రుతి
సాక్షి, తాడిపత్రి: అదనపు కట్నం తీసుకురాలేదన్న కక్షతో భార్యను, కన్నబిడ్డను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశాడు. అనంతరం తల్లిని, చెల్లిని వెంటబెట్టుకుని ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. రాత్రంగా చలిలోనే భర్త ఇంటి ఎదుట బిడ్డతో కలిసి బాధితురాలు నిరీక్షించింది. తాడిపత్రిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి బాధితురాలు శ్రుతి వేదన ఆమె మాటల్లోనే..
‘మాది రాయదుర్గం. నాన్న బి.భాస్కర్, అమ్మ శకుంతల. 2014లో నాకు తాడిపత్రిలోని సంజీవనగర్ మూడో రోడ్డుకు చెందిన డి.శ్రీకృష్ణ కిషోర్‌తో వివాహం జరిగింది. ఆ సమయంలో రూ.2లక్షల కట్నంతో పాటు 18 తులాల బంగారు నగలను మా తల్లిదండ్రులు ఇచ్చారు. అప్పట్లో ఆయన శ్రీరామ్ చిట్‌ఫండ్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. కొన్ని నెలలు మా జీవితం సాఫీగానే సాగింది. 2015లో ఆయన ఉద్యోగాన్ని వదిలేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో మాకు కుమార్తె శాన్విత జన్మించింది. ఉద్యోగం లేక ఖాళీగా ఇంటి పట్టునే ఉంటున్న నా భర్త, అతని తల్లి లక్ష్మీదేవి, చెల్లెలు అర్చన (2012లో కర్నూలుకు చెందిన వ్యక్తితో వివాహమై భర్తను వదిలి పుట్టింటిలోనే ఉంటోంది) నన్ను తరచూ అదనపు కట్నం కోసం వేధించేవారు. రూ. 5లక్షలు తీసుకుని రావాలంటూ పుట్టింటికి పంపారు. అయితే అంత పెద్ద మొత్తం తామిచ్చుకోలేమని అల్లుడికి మా అమ్మ తెలిపింది. అయితే మీ కూతురిని మీ ఇంట్లోనే పెట్టుకోండి అంటూ పుట్టినింటిలోనే నన్ను వదిలేసి వచ్చేశారు. పెద్దల జోక్యంతో తిరిగి అత్తింటికి చేరుకున్నా.. అప్పటి నుంచి నాపై వేధింపులు ఎక్కువయ్యాయి.
చదవండి: (అనంతపురం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు)
విడాకులకు దరఖాస్తు..
నాకు తెలియకుండానే మా ఆయన 2018లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించాను. దీంతో శనివారం రాత్రి నా భర్త కృష్ణకిషోర్‌తో పాటు వారి అమ్మ, చెల్లెలు నన్ను, పాపను కొట్టి ఇంట్లోనుంచి బయటకు గెంటేశారు. రాత్రి చలికి తట్టుకోలేకపోయాం. దిక్కుతోచని స్థితిలో 100కు కాల్ చేయడంతో పోలీసులు వచ్చారు. నా భర్తకు నచ్చజేప్పేందుకు సీఐ కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వారు వినలేదు పైగా తన తల్లిని, చెల్లిని వెంటబెట్టుకుని ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు. శనివారం రాత్రంతా ఇలా ఇంటి బయటే ఉండిపోయా. నా భర్తకు నచ్చచెప్పి మా కాపురాన్ని నిలబెట్టండి.’
అమ్మా నాన్నను కలపండి సారూ
‘మా డాడీ మా అమ్మను వదిలేసి పోతానంటున్నాడు. నాకేమో డాడీ, మమ్మీ ఇద్దరూ కావాలి. మా అమ్మ, నాన్నను కలపండి సారూ..’ – శాన్విత
చదవండి: (16 ఏళ్లకే నూరేళ్లు నిండిన ఓ ఆడబిడ్డ ఆక్రందన ఇది..!)
Comments
Please login to add a commentAdd a comment