బంగారం.. ఈ పేరు వింటే చాలు మహిళల కళ్లు జిగేల్‌మంటాయి.. ఉన్నోళ్లు, పెద్దగా లేనోళ్లు.. ఎవరైనా సరే ఉన్నంతలో పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లకు నగలు ధరించడం అంటే అత్యంత ప్రీతిపాత్రం.. అమ్మాయిల పెళ్లిళ్ల కోసం ఏళ్లతరబడి కూడబెట్టిన సొమ్ముతో పలువురు నగలు కొంటుంటారు.. మరికొందరు ఏటా కొద్ది మొత్తంలో బంగారం కొని, దాచుకుంటుంటారు.. ఇది నగదుకు ప్రత్యామ్నాయం.. అందువల్లే ఎప్పుడైనా, ఎక్కడైనా సరే బంగారానికి యమా గిరాకీ. ఈ గిరాకీనే వ్యాపారుల పాలిట ‘బంగారం’గా మారింది. లాభాల కోసం ‘అడ్డ దారి’ రాజ మార్గం అయింది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బంగారం ధర దేశ దేశాలకూ మారుతుంది. రాష్ట్రంలోనూ ఒక్కో ఊళ్లో ఒక్కో ధర ఉంటుంది. ఇదే అదనుగా చెన్నైలోని బంగారం (గోల్డ్) స్మగ్లింగ్ ముఠా పేట్రేగి పోతోంది. ఎయిర్‌పోర్టు, షిప్పింగ్ పోర్టులను అడ్డాలగా మార్చుకుని విదేశీ బంగారాన్ని తక్కువ ధరకు అనధికారికంగా దిగుమతి చేసుకుంటోంది. తర్వాత ఆభరణాలుగా తయారు చేసి అధిక ధరకు విక్రయిస్తోంది. ఈ క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు నగరానికి.. నెల్లూరు నుంచి లైన్ బిజినెస్ పేరుతో విశాఖపట్నం వరకు అన్ని ప్రాంతాలకు బంగారు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అతికొద్ది షాపులు మినహా ఎక్కడా పన్నులు చెల్లించిన దాఖలాలు లేవు. చెన్నై నగరం నుంచి కస్టమ్ డ్యూటీ, జీఎçస్టీ చెల్లించకుండా రోజూ నెల్లూరుతోపాటు రాష్ట్రమంతా వంద కిలోలకు పైగానే బంగారం బిస్కెట్లు, ఆభరణాలు సరఫరా అవుతున్నాయి.
నెల్లూరు నగరంలోని బంగారం విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు (ఫైల్) , గత డిసెంబర్‌లో చెన్నై నుంచి బస్సులో అక్రమంగా తరలిస్తున్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును పట్టుకున్న అధికారులు (ఫైల్)
ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా..
నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారం మారిన క్రమంలో ధరలు నింగినంటుతున్నాయి. ప్రధానంగా శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్, ఇతర అరబ్ దేశాల నుంచి ప్రతి రోజూ రాష్ట్ర సరిహద్దులోని చెన్నై నగరానికి కిలోల కొద్దీ బంగారం దిగుమతి అవుతోంది. బంగారానికి గతంలో 12.5 శాతం కస్టమ్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు దాన్ని 7.5 శాతానికి తగ్గించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర జీఎస్టీలు కలిపి 3 శాతం ఉంది. అంటే మొత్తంగా దిగుమతి అయి కొనుగోలు చేసే బంగారానికి 10.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ అవేవీ చెల్లించకుండానే వందల కిలోల బంగారం వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్‌కు ప్రత్యేక కొరియర్ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి.
తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటాం
బంగారం వ్యాపారాలపై తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటాం. ఫిర్యాదుల వస్తే తప్పకుండా తనిఖీలు చేపట్టి, ఫెనాల్టీతో పన్ను వసూలు చేస్తాం. రెండేళ్లలో 25 కేసులు నమోదు చేశాం. వారి నుంచి రూ.1.5 కోట్లకు పైగా పన్నుతో పాటు ఫెనాల్టీ విధించాం.
– కల్పన, జాయింట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ
త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
బంగారం వ్యాపారులు జీఎస్టీ ఎగవేతపై పక్కా సమాచారంతో ఇటీవల నెల్లూరు కేంద్రంలో మూడు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాం. క్రయ, విక్రయాలు, జీఎస్టీకి సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నాం. త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తాం.
– కె.రాజేశ్వరరెడ్డి, రీజనల్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, నెల్లూరు
స్మగ్లర్లకు ఆదాయం ఇలా..
► 24 క్యారెట్ల బంగారం కిలో ధర మద్రాసు బులియన్ మార్కెట్‌లో రూ.47.88 లక్షలు ఉండగా, హైదరాబాద్‌లో రూ.47.78 లక్షలుగా ఉంది. అదే దుబాయ్‌లో మన కరెన్సీ ప్రకారం రూ.42.59 లక్షలు, శ్రీలంకలో రూ.40.16 లక్షలు ఉంది.
► ఉదాహరణకు.. శ్రీలంక నుంచి కొనుగోలు చేస్తే, అక్కడి ధరకు 10.5 శాతం అంటే సుమారు రూ.4.20 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇలా చేయకుండా కస్టమ్స్ కళ్లుగప్పి.. లేదా వారితో ఒప్పందం కుదుర్చుకుని, తెచ్చిన బంగారాన్ని మద్రాసు ధర ప్రకారం కిలో రూ.47.88 లక్షలకు విక్రయిస్తారు.
► ఈ లెక్కన కేజీకి రూ.7 లక్షలు, పన్నుల రూపంలో మరో రూ.4 లక్షలు మొత్తంగా రూ.11 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇందులో సగటున 20 శాతం వరకు వివిధ శాఖలకు మామూళ్లు చెల్లించి వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
నెల్లూరు కేంద్రంగా భారీగా వ్యాపారం
► రాష్ట్రంలో బంగారు ఆభరణాల తయారీకి, ప్రత్యేకంగా స్టోన్ వర్క్ ఆభరణాల తయారీకి నెల్లూరు జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ ధరలు తక్కువ. డిజైన్లు ఎక్కువ. రోజూ సగటున వంద కేజీల బంగారం నెల్లూరు జిల్లా వ్యాపారులే కొంటున్నట్లు అంచనా.
► వీటిలో సగం బిస్కెట్ల రూపంలో, మిగిలిన సగం ఆభరణాల రూపంలో రైళ్లలో తీసుకొస్తారు. రాష్ట్రంలోకి 70 శాతం బంగారం చెన్నై ద్వారానే వస్తుంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోనూ ఇదే తరహాలో వ్యాపారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment