సాక్షి, అమరావతి: ఒకప్పుడు పెళ్లి అంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్లు, ఏడు అడుగులతో పాటు రుచికరమైన భోజనం, గుర్తుంచుకునేలా కొన్ని ఫొటోలు. కానీ ఇప్పుడు వాటన్నింటితో పాటు కళ్లు చెదిరే లొకేషన్లలో ప్రీ, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లు కూడా కలిపితేనే ‘అసలైన పెళ్లి’ అని యువ జంటలు అంటున్నాయి. పెళ్లికి ముందు(ప్రీ వెడ్డింగ్), ఆ తర్వాత(పోస్ట్ వెడ్డింగ్) తీసే ఫొటోలు, వీడియోల కోసం ఎంత దూరమైనా, ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసే ఇదే క్రేజ్. ఇందులో కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
పెళ్లి అనే కాదు.. పుట్టినరోజుతో పాటు శుభకార్యక్రమం ఏదైనా సరే.. ఫొటో, వీడియో షూట్‌లకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని.. ఫొటో షూట్‌లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలోని సముద్ర తీరాలు, నదులు, రిసార్టులు, పార్కులు ప్రస్తుతం ఫొటో షూట్‌లతో కళకళలాడుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని లంబసింగి, అరకు, పాడేరు, చింతపల్లి, మారేడుమిల్లి, రంపచోడవరంతో పాటు నల్లమల, శేషాచలం అటవీ ప్రాంతాలు కూడా యువ జంటల ఫొటో షూట్‌లకు అడ్డాలుగా మారిపోయాయి. మరికొందరైతే ఈ షూట్‌ల కోసం ఫొటోగ్రాఫర్లను వెంటబెట్టుకొని దేశ, విదేశాలకు కూడా వెళ్లివస్తున్నారు. ట్రెండ్‌కు తగ్గట్లు సినీ పాటలకు స్టెప్పులు వేస్తూ.. తమ ప్రేమను, అనుబంధాన్ని వ్యక్తం చేసేలా ఫొటోలు తీయించుకుంటూ మురిసిపోతున్నారు.
షూట్‌ల కోసం ప్రత్యేక స్టూడియోలు..
సినిమాలను తలపించేలా తీస్తున్న ఈ ఫొటో, వీడియో షూట్‌ల కోసం రాష్ట్రంలోని చాలా చోట్ల ప్రత్యేకంగా స్టూడియోలు కూడా ఏర్పాటయ్యాయి. వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని అందమైన ప్రదేశాలు, భవనాలను పోలిన నిర్మాణాలను ఈ స్టూడియోల్లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఈ స్టూడియోలు వెలిశాయంటే.. ఫొటో షూట్‌లకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల భీమవరంలో మూడు, పాలకొల్లులో రెండు, కాకినాడలో మూడు స్టూడియోలు ఏర్పాటయ్యాయి. ఇంకా పలు చోట్ల స్టూడియోలు నిర్మాణంలో ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లిలేని వారు.. ఈ స్టూడియోలకు వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు.
ఖర్చుకు వెనుకాడడం లేదు..
ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్‌లకు భారీ క్రేజ్ ఉంది. 90 శాతం జంటలు పెళ్లితో పాటు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. వారి ఆసక్తికి తగినట్లే అందమైన లొకేషన్లలో ఫొటోలు, వీడియోలు తీసి.. ట్రైలర్లు(చిన్న వీడియోలు)గా మార్చి.. శుభ కార్యక్రమానికి ముందే అందిస్తున్నాం. దీంతో వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసి.. ఆహా్వనాలుగా ఉపయోగిస్తున్నారు.
– షేక్ గౌస్‌బాషా, ఫొటోగ్రాఫర్
Comments
Please login to add a commentAdd a comment