కొరత కారణంగా పెరిగిన పండ్ల ధరలతో అన్నదాతలకు ఊరట
దిగుబడి లేక కొందరికి తప్పని నిరాశ
ప్రస్తుతం అరకొరగా గెలల దిగుబడి
మారిన వాతారణ పరిస్థితులే కారణం
శుభకార్యాల నేపథ్యంలో పండ్లకు పెరిగిన డిమాండ్
ఎన్నడూ లేని ధరతో కొనుగోలుదారులకు అవస్థలు
మధురమైన రుచులతో సామాన్యులకు అందుబాటులో ఉండే అరటి పండు ధర అమాంతం పెరిగింది. సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే బెదిరిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు ధరలు లేక తోటల్లో గెలలు చెట్లకే మగ్గిపోయిన పరిస్థితి.
ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో భారీగా ధర పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి లేని సమయంలో డిమాండ్ పెరగడంతో మరికొందరు రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు. పండ్ల కొనుగోలుదారులు మాత్రం అరటి అంటే చాలు అమ్మో అనే పరిస్థితికి వచ్చారు.
కొల్లూరు: మారిన వాతావరణ పరిస్థితిలో అరటి దిగుబడి అంతగా లేదు. పెనుగాలులు, ఎండలు, ప్రస్తుతం వాతావరణంలో వేడి తీవ్రంగా ఉండటంతో అరటి దిగుబడి మందగించింది. జిల్లాలో సుమారు 2,379 మంది రైతులు 3,710 ఎకరాలలో అరటి సాగు చేస్తున్నారు. కర్పూర, చక్రకేళి, కూర అరటి రకాలు ఇందులో ఉన్నాయి.
ఎకరాకు 800 వరకు అరటి మొక్కలు సాగు చేస్తే 10 నెలల వ్యవధిలో పంట చేతికి అందుతుంది. ఎకరాకు సుమారు రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి అవసరం. పంట చేతికందిన అనంతరం స్థానిక మార్కెట్లలో అమ్మకాలు జరపడంతోపాటు తోటల్లోనే వ్యాపారులకు గెలలు విక్రయిస్తున్నారు.
రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, విజయవాడ, తిరుపతి ప్రాంతాలతోపాటు తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒరిస్సా వంటి రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు. ప్రస్తుతం సాగు విస్తీర్ణంలో 5 శాతం కంటే తక్కువ తోటల్లో మాత్రమే గెలలు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొరత ఏర్పడి ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు శ్రావణమాసంలో అధికంగా పూజలు, శుభకార్యాలు ఉండటంతో పండ్లకు డిమాండ్ పెరిగింది.
వేసవిలో గెలలు కొనే వారే లేకపోవడంతో సాధారణ, మొదటి రకం గెలలు రూ. 20 నుంచి రూ. 30కు సైతం విక్రయించిన రైతులు నష్టాలపాలయ్యారు. ప్రస్తుతం కర్పూర అరటి మొదటి రకం రూ. 1,200, సాధారణ రకం రూ. 800 వరకు పలుకుతున్నాయి. చక్రకేళి రకం గెలకు రూ. 450 వరకు ధర లభిస్తోంది. కూర అరటి గెల రూ. 300కు అమ్ముడవుతోంది. పండ్లు డజను రూ. 80 నుంచి రూ. 120 వరకు విక్రయిస్తున్నారు.
గెల రూ. 400 పలికినా లాభమే..
అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న అరటి పంటకు ప్రస్తుతం పలుకుతున్న ధరలు ఇలాగే ఎప్పుడూ ఉండవు. కనీసం గెలకు రూ. 400 వరకు పలికినా లాభాలు వస్తాయి. రెండేళ్ల పంట కాలంలో రెండు పర్యాయాలు కాపునకు వచ్చే గెలలు అధికంగా దిగుబడి వచ్చే నవంబర్ నుంచి రేట్లు పడిపోకుండా ఉంటే మాకు మేలు చేకూరుతుంది. – ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, రైతు, కిష్కిందపాలెం, కొల్లూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment