కాకినాడ మార్గదర్శిలో తనిఖీలు చేస్తున్న అధికారులు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తిరుపతి: చిట్‌ఫండ్ కంపెనీల్లో పెద్దఎత్తున అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదుల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కొద్దిరోజులుగా రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. అక్టోబర్ 21, 31 తేదీల్లో డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులతో కలిసి రెండు విడతలుగా తనిఖీలు చేసి పలు అవకతవకలను గుర్తించింది. దానికి కొనసాగింపుగా మంగళవారం రాష్ట్రంలోని 18 సంస్థల్లో తనిఖీలు చేసింది.
ప్రాథమిక పరిశీలనలో ఆయా కంపెనీల 2021–22 బ్యాలెన్స్ షీట్లను పరిశీలించినప్పుడు పెద్దఎత్తున నిధులు దారి మళ్లినట్టు గుర్తించారు. చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధంగా వేలానికి ముందే చందాదారుల నుంచి చిట్ సొమ్మును కట్టించుకుంటూ దానికి 5 శాతం వడ్డీని చెల్లిస్తున్నట్టు తేలింది. చిట్ పాడుకున్న చందాదారుల నుంచి గ్యారంటీ తీసుకుంటున్న కంపెనీలు, తాము చిట్‌ను పాడినప్పుడు మాత్రం ప్రభుత్వానికి గ్యారంటీ చూపించడంలేదని స్పష్టమైంది. చందాదారులు ఆలస్యంగా చిట్ సొమ్ము కట్టారనే సాకు చూపించి పెనాల్టీలు వసూలు చేసి దానికి జీఎస్టీ చెల్లించకపోవడం, పెనాల్టీల పేరుతో చందాదారుల నుంచి ఎక్కువ సొమ్మును వసూలు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఉల్లంఘనలెన్నో!
పలు చిట్ కంపెనీలు 1982 చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టు తనిఖీల్లో స్పష్టమైంది. చిట్ల సొమ్మును ఇతర కార్యకలాపాలకు మళ్లించినట్టు గుర్తించారు. చిట్ల సొమ్మును ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయడం, రుణాలు ఇవ్వడం ద్వారా ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. ఈ సొమ్ముతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా చెందిన చిట్ల సొమ్మును అనుబంధంగా కంపెనీలకు మళ్లించి వాడుకుంటున్నాయి. అకౌంట్ల నిర్వహణ, వ్యాపార రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి.
మార్గదర్శిలోనూ సోదాలు
విశాఖ జిల్లాలోని మార్గదర్శితో పాటు ఇతర చిట్‌ఫండ్ కంపెనీల్లో రికార్డులను అధికారులు పరిశీలించారు. నిధుల మళ్లింపుపై ఆరా తీశారు. తిరుపతిలోని మార్గదర్శి కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి చిట్స్ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించుకుంటున్నారని, ఆ సొమ్ముతో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment