సాక్షిలో ఆ పెట్టుబడులు సక్రమమే | IT Appellate Tribunal clarifies on investments made in Sakshi Media | Sakshi
Sakshi News home page

Sakshi Media: సాక్షిలో ఆ పెట్టుబడులు సక్రమమే

Published Thu, Jan 13 2022 3:21 AM | Last Updated on Thu, Jan 13 2022 1:10 PM

IT Appellate Tribunal clarifies on investments made in Sakshi Media

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమేనని, చట్టబద్ధమేనని స్పష్టమయింది. జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని, ఇన్వెస్ట్‌మెంట్ల స్వీకరణలో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ జగతి పబ్లికేషన్స్‌ పాటించిందని ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ స్పష్టంచేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ క్విడ్‌–ప్రో–కో రూపంలో వచ్చాయి కనుక వాటిని ఆదాయంగా పరిగణించి, ఆ మొత్తంపై పన్ను చెల్లించాలంటూ 2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ఐటీఏటీ కొట్టివేసింది.

ఐటీ విభాగం తమ వాదనకు మద్దతుగా సమర్పించిన సీబీఐ ఛార్జిషీటును... అసలు సాక్ష్యంగానే  పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలేవీ ఆ ఛార్జిషీట్లకు లేవని కూడా బెంచ్‌ వ్యాఖ్యానించింది. ‘‘ఆ ఛార్జిషీట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్‌మెంట్‌ ఇయర్‌ దాటి ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా? క్విడ్‌ ప్రోకో ఆరోపణలు నిరూపించే ఆధారాలు సంపాదించారా? సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా సమర్పిస్తే ఎలా? సీబీఐ ఛార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్దతా లేదు.

ఈ కేసులో అవి అనవసరం, అప్రస్తుతం కూడా’’ అని జ్యుడీషియల్, అకౌంటింగ్‌ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్‌ బెంచ్‌ తేల్చిచెప్పింది. తద్వారా... సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై పదేళ్లుగా టీడీపీ అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన గ్యాంగ్‌లోని ఎల్లో మీడియా పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారానికి తెరవేసినట్లయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలూ సమగ్రంగా విన్న అనంతరం గతనెల 23న బెంచ్‌ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. నాటి ఐటీ అధికారి ఇచ్చిన ఉత్తర్వు చెల్లదంటూ... అందులో పేర్కొన్నట్లుగా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది.

ప్రీమియాన్ని ఆదాయమంటారా?
2008–09 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో సాక్షి మీడియా గ్రూపునకు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పలువురు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్‌ చేశారు. రూ.10 ముఖ విలువగల షేరుకు 350 రూపాయలు ప్రీమియం చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ప్రీమియం రూపంలో వచ్చిన రూ.277 కోట్లను ఆదాయంగా పేర్కొంటూ... దానిపై పన్ను చెల్లించాలని 2011లో నాటి ఐటీ అధికారి సంస్థకు నోటీసులిచ్చారు. జగతి సంస్థ దాన్ని సవాలు చేసింది. వివిధ విచారణల అనంతరం అదిపుడు ఐటీ ట్రిబ్యునల్‌ ముందుకు వచ్చింది.

షేర్లను విక్రయించటం ద్వారా సమీకరించిన పెట్టుబడిని ఏ కంపెనీ అయినా మూలధనంగా పరిగణిస్తుంది. కానీ... ముఖ విలువ రూపంలో స్వీకరించిన షేరుకు రూ.10ని మాత్రం చట్టబద్ధమైనదిగా... సక్రమమైనదిగా పేర్కొన్న ఐటీ అధికారి... ఆయా ఇన్వెస్టర్లకు ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు కట్టబెట్టిందని, అందుకే అంత ప్రీమియానికి వారు ఇన్వెస్ట్‌ చేశారని, క్విడ్‌ ప్రోకో రూపంలో వచ్చిన ప్రీమియాన్ని ఆదాయంగా పరిగణించాలని ఐటీ అధికారి పేర్కొనటాన్ని బెంచ్‌ తప్పుబట్టింది. దీనికి సాక్ష్యంగా ప్రత్యేక కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లను తమకు సమర్పించడాన్ని కూడా బెంచ్‌ ఆక్షేపించింది. 

‘‘షేర్‌ ముఖ విలువ రూపంలో వచ్చిన సొమ్ము సహేతుకమే అంటున్నారు. దానిపై ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తంచేయటం లేదు. జగతి సంస్థ కార్యకలాపాల విషయంలోనూ ఎలాంటి అభ్యంతరాలూ లేవు. వారి అభ్యంతరమల్లా షేర్‌ ప్రీమియంపై మాత్రమే’’ అంటూ ఒక కంపెనీ పెట్టిన మొత్తంలో కొంత సక్రమం, మరికొంత అక్రమం ఎలా అవుతుందని బెంచ్‌ ప్రశ్నించింది. దీన్ని ఇంకోలా చూద్దామంటూ.... ‘‘ఒకే కంపెనీ!. ముఖ విలువ పెట్టినపుడేమో సక్రమమైనది. షేర్‌ ప్రీమియం విషయంలో మాత్రం సక్రమం కాకుండా పోతుందా? ఒకే కంపెనీ విషయంలో అధికారి ఇలా రెండు రకాలుగా ఎలా ఆలోచిస్తారు? కాబట్టి రూ.277 కోట్లు పెట్టుబడిగానే వచ్చిందని, ఆదాయం కాదని మేం భావిస్తున్నాం’’ అని బెంచ్‌ తేల్చిచెప్పింది. 


ఒక్కొక్కరికీ ఒక్కో‘లా’ ఎలా?
‘‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది.  వారి విషయంలో ఎలాంటి క్విడ్‌ ప్రో కో లావాదేవీలూ జరగలేదని స్పష్టంగా చెప్పింది. పోనీ... మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్‌ప్రోకో జరిగిందని కూడా ఆ మెమోలో చెప్పలేదు. మరి క్విడ్‌ ప్రో కో అని మీరెలా అంటారు?’’ అని బెంచ్‌ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది. ప్రయివేటు లిమిటెడ్‌లో షేరు  ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయమవుతుందని పేర్కొంది. 

వాల్యుయేషన్‌ నివేదిక నిజమేగా?
పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లకు వాల్యుయేషన్‌ నివేదికలు చూపించారని, ఆ నివేదికలు కంపెనీ వేసిన అంచనాలు, కంపెనీ ఇచ్చిన సమాచారం మేరకే రూపొందించారని, అవి సరైనవి కావని ఐటీ విభాగం పేర్కొంది. దానిప్రకారం షేరు ప్రీమియాన్ని నిర్ణయించటం సరికాదన్న వానదతో బెంచ ఏకీభవించలేదు. ‘‘వాల్యుయేషన్‌ రిపోర్టును అస్సలు తప్పు బట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంచాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్లుగానే  సర్క్యులేషన్‌ పెరిగింది. పోటీపత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది. పోటీ పత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్క్యులేషన్‌ను సాక్షి ఏడాదిన్నరలోనే సాధించింది. కనక వాల్యుయేషన్‌ నివేదికను తప్పుబట్టలేం. సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకున్నా అంత ప్రీమియం తీసుకున్నారనే వాదన అర్ధరహితం. వారి లీడర్‌షిప్‌లో ఆ పత్రిక అంచనాలన్నిటినీ అందుకుంది. కాబట్టి క్విడ్‌ ప్రో కో వాదనకు అర్థమే లేదు’’ అని బెంచ్‌ పేర్కొంది.

ఇన్వెస్టర్ల వాదనను గమనించారా?
సాక్ష్యాలుగా సమర్పించిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థల డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాశ్‌ చేసిన వాదనను బెంచ్‌ ప్రస్తావించింది. ‘‘ఈనాడులో పెట్టుబడులకోసం బ్లాక్‌స్టోన్‌ అనుకున్న విలువలో 20 శాతం డిస్కౌంట్‌కే సాక్షిలో వాటా దొరికింది. 5 ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడియా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’’ అనే వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకోవాలని బెంచ్‌ వ్యాఖ్యానించింది. వచ్చిన పెట్టుబడులు షేరు ముఖ విలువ రూపంలో వచ్చాయా? ప్రీమియం రూపంలోనా? అనేది అప్రస్తుతమని, అది ఆదాయమా? కాదా? అన్నదే ప్రశ్న అని... ఆదాయంగా పరిగణించలేమని విస్పష్టంగా తేల్చిచెప్పింది. 

తెలియని మార్గాలంటే ఎలా?
కోల్‌కతాలోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన రూ.15 కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్‌ తప్పుబడుతూ... కోల్‌కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీకి సంబంధించిన పాన్, రిజిస్ట్రేషన్‌ నెంబరు, అడ్రసు వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని, అన్నీ చట్టబద్ధంగానే ఉన్నపుడు ‘గుర్తు తెలియని ఆదాయం’ ఎలా అవుతుందని ప్రశ్నించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement