‘నోట్లు’ కాజేసిన ఎస్సై అరెస్ట్
మరో నలుగురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు
తూప్రాన్ (కాళ్లకల్): నోట్ల మార్పిడి కోసం వచ్చిన వారిపై దాడికి పాల్పడి, వారి వద్ద డబ్బు కాజేసిన మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎస్సై ఆనంద్‌గౌడ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో నలుగురిని కూడా అరెస్టు చేసినట్లు స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్ల డించారు. ఎస్సై ఆనంద్‌గౌడ్, మరికొందరు ఈ నెల 12న రాత్రి కాళ్లకల్ గ్రామ శివారులో నోట్ల మార్పిడి కోసం వచ్చిన ముఠా సభ్యులను బెదిరించి, వారి నుంచి డబ్బు కాజేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎస్సై ఆనంద్‌గౌడ్‌తో పాటు కాళ్లకల్‌కు చెందిన ఎర్ర వెంకటేశం, కూతురు రాజుగౌడ్, ఫాంహౌస్ గుమాస్తా పరియాగ్ సింగ్, మనోహరాబాద్‌కు చెందిన ర్యాకల భిక్షపతిగౌడ్‌లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
రాజుగౌడ్ వద్ద రూ.21.5 లక్షలు, భిక్షపతిగౌడ్ వద్ద రూ.12.76 లక్షలను స్వాధీనం చేసుకున్నామని.. నిందితులను గజ్వేల్ కోర్టు ఎదుట హాజరుపరిచామని వెల్లడించారు. కాగా.. జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా నూతన మండలంగా ఏర్పాటైన మనోహరాబాద్ ఎస్సైగా ఆనంద్‌గౌడ్ నియామకం అయ్యారు. నెల రోజుల కింద నర్సాపూర్ డివిజన్ పరిధిలోని చిల్పిచెడ్‌కు ఆయనను బదిలీ చేయగా.. తనకున్న రాజకీయ పలుకుబడితో తిరిగి పదిహేను రోజుల క్రితం మనోహరాబాద్ ఎస్సైగా బదిలీ చేయించుకున్నారు. ఈ క్రమంలో స్థానికంగా తనకున్న పరిచయాలతో నోట్ల మార్పిడిలో దందా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
సీబీఐ అదుపులో జయచంద్ర
సాక్షి, బెంగళూరు: ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో వందల కోట్ల అక్రమ ఆస్తులు బయటపడడంతో అరెస్టయిన కర్ణాటక రాష్ట్ర రహదారి అథారిటీ ప్రణాళిక డైరెక్టర్ ఎస్.సీ.జయచంద్రను శుక్రవారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జయచంద్ర ఇంటిపై దాడులు నిర్వహించగా రూ.5.7 కోట్ల నగదు, కేజీల కొద్దీ బంగారం, వందల కోట్ల ఆస్తులకు చెందిన పత్రాలు లభించడంతో జయచంద్రను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌ను పరిశీలించిన ఈడీ కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలకాగానే సీబీఐ అధికారులు జయచంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు కూడా ఆయనపై కేసులు నమోదు చేశారు. సీబీఐ దర్యాప్తులో ఎంతమంది పేర్లు బయటకు వస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జయచంద్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సన్నిహితుడనే పేరుంది.
సీబీఐ కస్టడీకి సుధీర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులకు ఉపయుక్తంగా ఏర్పాటు చేసిన ‘మార్పిడి’లో అవకతవకలకు పాల్పడిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఎస్‌ఎస్‌పీఓఎస్) కె.సు«ధీర్ బాబును ఐదు రోజుల కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈయన్ను సీబీఐ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలో మూడు పోస్టాఫీసులు కేంద్రంగా జరిగిన రూ.2.95 కోట్ల అవకతవకలకు సూత్రధారి అయిన సుధీర్, గత గురువారం సీబీఐ అధికారుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. కొందరు వ్యాపారులు, బడా బాబుల నుంచి కమీషన్ తీసుకుని వారి పాత కరెన్సీని మార్చి ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. హిమాయత్‌నగర్, కార్వాన్, గోల్కొండ పోస్టాఫీసుల ద్వారా సాగిన ఈ వ్యవహారాలకు సంబంధించి కేసులు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుధీర్‌బాబును లోతుగా విచారిస్తున్న అధికారులు.. పోస్టల్ ఉద్యోగుల సాయంతో మార్చిన రూ.2.95 కోట్లు ఎవరివనేది ఆరా తీస్తున్నారు. తర్వాత వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చనున్నారు.