ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
సమస్యలు తీరి సంతోషంగా జీవనం
నేను వ్యవసాయ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో కాపురం ఉంటూ వచ్చిన అరకొర ఆదాయంతో పిల్లల చదువులు ఎలా అని నిత్యం తల్లడిల్లిపోయే వాళ్లం. గత ప్రభుత్వ హయాంలో మాకు ఎలాంటి సాయం అందలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మాకు చాలా మేలు జరిగింది. బడికెళ్తున్న మా అమ్మాయికి ఐదేళ్లుగా జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు వంతున వచ్చింది.
వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 వంతున, వైఎస్సార్ ఉచిత పంట బీమా ద్వారా రూ.6,460, ఇన్‌పుట్ సబ్సిడీ పథకం ద్వారా రూ.31,950 వచ్చాయి. ముఖ్యంగా నిరుపేదలైన మాకు విలువైన ఇంటి స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయంగా రూ.1.80 లక్షలు మంజూరయ్యాయి. దాంతో ఇంటి నిర్మాణం చేపట్టాం. ఇప్పుడు మా కుటుంబం హాయిగా జీవిస్తోందంటే దానికి కారణమైన ముఖ్యమంత్రి జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – అంసూరి జయపాలకృష్ణ, కపిలేశ్వరపురం (పెద్దింశెట్టి లెనిన్ బాబు, విలేకరి, కపిలేశ్వరపురం)
బిచ్చగాళ్లను కాస్తా లక్షాధికారులను చేశారు
మా తల్లిదండ్రులు, తాతలు సంచార జీవనం గడుపుతూ... ఆకివీడులోని దుంపగడప రైల్వే గేటు వద్ద రైల్వే స్థలంలో 50 ఏళ్లుగా గుడారాల్లో జీవనం గడిపారు. నా తల్లిదండ్రులు రైల్వే స్థలంలో గుడిసె వేసుకుని జీవించారు. మాకు, మా తల్లిదండ్రులకు, తాత ముత్తాతలకు చదువులు లేవు. గుంతలు, కాల్వల్లో చేపలు పట్టుకుని భిక్షాటన చేసి జీవనం సాగించాం. రైల్వే స్థలం నుంచి మమ్మల్ని ఖాళీ చేయించినప్పుడు అప్పటి ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు పెద్ద మనస్సుతో మా తల్లిదండ్రులకు సమతానగర్ రోడ్డులోని చినకాపవరం డ్రెయిన్ వద్ద స్థలాలు ఇచ్చారు. పాకలు, రేకుల షెడ్లు వేసుకుని మా తల్లిదండ్రులతో కలిసి ఉన్నాం.
నాకు పెళ్లయిన తరువాత ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 11 మంది చెంచులకు కుప్పనపూడి శివారు తాళ్లకోడు వద్ద ఒక్కొక్కరికి సెంటు భూమి చొప్పున కేటాయించారు. ఇంటి నిర్మాణానికి రూ. 1.80లక్షలు ఆర్థిక సాయం చేశారు. డ్వాక్రా రుణం తీసుకుని, కొద్దిగా అప్పు చేసి ఆ మొత్తానికి జమచేసి మేము పక్కా భవనం నిర్మించుకుంటున్నాం.
జగనన్న దయతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. అమ్మ ఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు వంతున సాయం అందుతోంది. ప్రభుత్వ పాఠశాలలో మంచిగా చదువు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. స్కూలుకు వెళ్లే పిల్లలకు దుస్తులు, బ్యాగ్‌లు, పుస్తకాలు, టై, బూట్లు ఇవ్వడం బాగుంది. ప్రస్తుతం మేము చేపలు పట్టుకోవడంతోపాటు చిన్నచిన్న పనులు చేసుకుని జీవిస్తున్నాం. బిక్షగాళ్లుగా ఉన్న మమ్మల్ని లక్షాధికారులను చేసిన ఘనత జగన్‌దే. ఆయనకు రుణపడి ఉంటాం. – నల్లబోతుల అప్పన్న తాళ్లకోడు (బీఆర్ కోటేశ్వరరావు, విలేకరి, ఆకివీడు)
ఇంతటి సాయం ఎన్నడూ ఎరుగం
మాది నిరుపేద కుటుంబం. ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఎంతో ఆసరాగా నిలిచాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామంలో చిన్న చికెన్ దుకాణాన్ని పెట్టుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. గత ప్రభుత్వంలో ఏ మేలూ జరగలేదు. ఈ ప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరింది.
స్థలం మంజూరు చేయడమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. నా భార్య వరలక్ష్మి ఇంటి దగ్గర టైలరింగ్ చేస్తూ నాకు అండగా నిలుస్తోంది. ఆమెకు చేదోడు కింద గత మూడేళ్లగా ఏటా రూ.10 వేలు, అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందింది. మాకు ఆర్థికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి జీవితాంతం రుణ పడి ఉంటాం. – దొమ్మా వీరబాబు, ప్రత్తిపాడు (ప్రగడ రామకృష్ణ, విలేకరి, ప్రత్తిపాడు రూరల్)
Comments
Please login to add a commentAdd a comment