జస్టిస్ బీఎస్‌ఏ స్వామి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ ఫైర్ బ్రాండ్. దళిత, బలహీన వర్గాల్లో ఎంతో పేరున్న ఆయన హైకోర్టులో కులత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. పదవీ విరమణ తర్వాత 2005లో ‘ఎ క్యాస్ట్ క్యాప్చర్ ఏపీ జుడీషియరీ’ పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు. అందులో ప్రధానంగా ఏపీ హైకోర్టు రాజకీయాలను ప్రస్తావించారు. జస్టిస్ ఎన్‌వీ రమణ, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మధ్య ఉన్న బాంధవ్యాన్ని, న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని స్పష్టంగా వివరించారు. ఆ పుస్తక ప్రతులను రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలందరికీ పంపించారు. అప్పట్లో ఈ పుస్తకం ఓ సంచలనం రేపింది. ఇందులో చంద్రబాబు, జస్టిస్ రమణల గురించి ఆయన రాసిన వివరాలు యథాతథంగా ఇలా ఉన్నాయి.
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబునాయుడు అంతరంగిక కాపలాదారు జస్టిస్ ఎన్‌వీ రమణ. చంద్రబాబుకు, ఈ పెద్ద మనిషి (ఎన్‌వీ రమణ)కి మధ్య ఉన్న ఆ బాంధవ్యం ఏంటో మాకెవ్వరికీ తెలియదు. వాస్తవానికి చంద్రబాబు.. ఎన్‌వీ రమణను రాజ్యసభకు పంపాలనుకున్నారు. కానీ అదనపు అడ్వొకేట్ జనరల్‌ను చేశారు. న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు అదనపు ఏజీ హోదాలో ఆయనేమీ పెద్ద కేసుల్లో వాదనలు వినిపించింది లేదు. ఆల్మట్టి కేసుల్లో రాష్ట్రానికి ఆయన ఎలాంటి న్యాయ సేవలు అందించారో అందరికీ తెలుసు.
చంద్రబాబు-జడ్జీలకు మధ్య రమణ అనుసంధానకర్త
చంద్రబాబునాయుడుకు, హైకోర్టు జడ్జీలకు మధ్య జస్టిస్ రమణ లైజనింగ్ చేసేవారు. న్యాయమూర్తుల అవసరాలను చూసుకునేవారు. పదవీ విరమణ తర్వాత పోస్టులిస్తామని ఆశ చూపేవారు. తద్వారా చంద్రబాబు ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి ఉత్తర్వులు రాకుండా చూసేవారు. జస్టిస్ ఎన్‌వీ రమణ ఆమోదం లేకుండా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఏ ఫైలును కూడా చంద్రబాబు క్లియర్ చేసేవారు కాదు. అది న్యాయమూర్తుల నియామకం కావొచ్చు.. న్యాయాధికారుల నియామకం కావొచ్చు.. ప్రభుత్వ రంగ సంస్థలకు న్యాయ సలహాదారుల నియామకం కావొచ్చు. ఆశావహులంతా ఆయన ఇంటి ముందు, ఆయన ఛాంబర్ ముందు క్యూలో నిలబడేవారు. సీనియర్ న్యాయమూర్తులు కూడా ఆయన చెప్పినట్లు ఆడేవారు. ఆయన ఛాంబర్‌లో వారంతా ముచ్చట్లాడుకునేవారు. జస్టిస్ ఎన్‌వీ రమణ హీనమైన రాజకీయాలతో న్యాయ మూర్తులు రెండు వర్గాలుగా విడిపోయారు.
సుప్రీంకోర్టు ఓసారి రమణ పేరును తిరస్కరించింది..
హైకోర్టు న్యాయమూర్తి పోస్టుకు జస్టిస్ ఎన్‌వీ రమణ పేరును జస్టిస్ బెనర్జీ సిఫారసు చేశారు. అప్పటికి ఎన్‌వీ రమణ వయస్సు 42 సంవత్సరాలు. అయితే బెనర్జీ సిఫారసును సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత జస్టిస్ వర్మ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు జరిగాయి. ఈ మార్గదర్శకాలను అడ్డంపెట్టుకుని, మళ్లీ సిఫారసులు అవసరం లేకుండా చంద్రబాబునాయుడు, ఎన్‌వీ రమణలు పాత సిఫారసులనే పునరుద్దరించేలా మేనేజ్ చేశారు. దీంతో జస్టిస్ ఆనంద్ హయాంలో రమణ హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. అటు చంద్రబాబు, ఇటు రమణలు జస్టిస్ ఆనంద్‌తో మంచి సంబంధాలు నెరిపారు. న్యాయమూర్తుల ఖాళీలు ఉన్నప్పటికీ, వాటిని భర్తీ చేసేందుకు తాజా పేర్లను సిఫారసు చేయకుండా అప్పటి హైకోర్టు సీజే జస్టిస్ లిబరహాన్‌ను ప్రభావితం చేశారు. మళ్లీ పేర్లు వెళితే, అందులో తన పేరు ఉన్నప్పటికీ.. వయసు రీత్యా మిగిలిన వారి కంటే తాను జూనియర్‌గా ఉంటానన్న భావనతో జస్టిస్ ఎన్‌వీ రమణ ఇదంతా చేశారు.
అప్పుడు జస్టిస్ ఎన్‌వీ రమణే డీఫాక్టో సీజే
ఎస్‌బీ సిన్హా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నంత కాలం డీఫాక్టో ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణే. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలను కాపాడే రక్షకుడిగా ఉన్నారు. ఆయన హయాంలో రమణ మాటే వేదవాక్కు. న్యాయవాది బి.ఆదినారాయణరావుకు సీనియర్ హోదా ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నా, జస్టిస్ సిన్హా ఆ పని చేయలేదు. సీనియర్ న్యాయవాది హోదా కోసం ఆదినారాయణరావు చేసుకున్న దరఖాస్తును జస్టిస్ రమణ కోరిక మేరకు తిరస్కరించడానికే అలా చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌బీ సిన్హా, జస్టిస్ ఏఆర్ లక్ష్మణన్, జస్టిస్ దేవీందర్‌గుప్తాలు చంద్రబాబునాయుడుకు నమ్మినబంటు అయిన జస్టిస్ రమణ చెప్పినట్లు ఆడేవారు. వీరంతా కలిసి ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన కేసులను తన వద్ద నుంచి తీసేశారని జస్టిస్ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సీవై సోమయాజుల కోటరీ అండతో పలువురు ప్రధాన న్యాయమూర్తులు నన్ను ఎలా వేధింపులకు గురి చేశారన్న విషయాలను నేను ప్రస్తావించదలచుకోలేదు. జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవీందర్‌గుప్తా రంగారెడ్డి జిల్లా పోర్ట్‌పోలియో జడ్జిగా నియమించారు. ఈ జిల్లాలో భూ లావాదేవీలు కోట్ల రూపాయల్లో ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.
అందుకే రోహిణిని జడ్జిని చేశారు..
చంద్రబాబు కోసం జస్టిస్ ఎన్‌వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన ప్రతి ప్రధాన న్యాయమూర్తిని ప్రలోభపెట్టేవారు. అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని చేస్తామని వారికి ఆశ చూపేవారు. ప్రభా శంకర్ మిశ్రా మినహా పలువురు ప్రధాన న్యాయమూర్తులు ఈ ఇద్దరి ఎర కోసం వలలో చిక్కుకుని, వారు చెప్పినట్లు ఆడేవారు. వాస్తవానికి న్యాయవాది ఎన్.శోభ హైకోర్టు న్యాయమూర్తి అవుతారని న్యాయవాదులందరూ భావించారు. అయితే ఎన్‌వీ రమణ మాత్రం ఈమె జడ్జి అయితే తన తోకగా ఉండరన్న ఉద్దేశంతో జస్టిస్ రోహిణిని న్యాయమూర్తి చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిబరహాన్ మొత్తం నలుగురి పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేశారు. అందులో పీఎస్ నారాయణది మొదటి పేరు కాగా, రోహిణిది చివరి పేరు. ఆశ్చర్యకరంగా ఆ నలుగురిలో కేవలం ఈ రెండు పేర్లు మాత్రమే క్లియర్ అయ్యాయి. ఇలా ఎందుకు జరిగిందనేది ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆ తర్వాత మిగిలిన రెండు పేర్లు కూడా ఆమోదం పొందాయి. అంతిమంగా జస్టిస్ రోహిణి మిగిలిన ఇద్దరి కంటే సీనియర్ అయ్యారు. వాస్తవానికి రోహిణి కంటే మిగిలిన ఇద్దరు కూడా వయస్సులో పెద్దవారు. జస్టిస్ ఎన్‌వీ రమణ న్యాయ వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేసి ఉంటే, పరిస్థితులు చాలా బాగుండేవి. కానీ న్యాయ వ్యవస్థ తలరాత మరోలా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment