జస్టిస్ గుహనాథన్ నరేందర్‌తో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్
సాక్షి,అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా గుహనాథన్ నరేందర్ సోమవారం ప్రమాణం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ప్రమాణం అనంతరం జస్టిస్ నరేందర్‌ను గవర్నర్ అభినందించారు.
అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమ ప్రొసీడింగ్స్‌ను నిర్వహించారు. అనంతరం జస్టిస్ నరేందర్ నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు చదివి వినిపించారు. కాగా.. రాజ్‌భవన్‌లో జస్టిస్ నరేందర్‌ను అటు గవర్నర్, ఇటు ముఖ్యమంత్రికి జస్టిస్ ధీరజ్ సింగ్ పరిచయం చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో అందరూ పాల్గొన్నారు.
30కి చేరిన న్యాయమూర్తుల సంఖ్య
జస్టిస్ నరేందర్ నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. జస్టిస్ నరేందర్ హైకోర్టులో నాలుగో స్థానంలో కొనసాగుతారు. మంగళవారం ఆయన జస్టిస్ దుర్గాప్రసాదరావుతో కలిసి కేసులను విచారిస్తారు. వాస్తవానికి ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే.. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం, తిరిగి రావడంలో జాప్యం జరగడంతో జస్టిస్ నరేందర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొనలేకపోయారు.
దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్ జి.నరేందర్
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.నరేందర్ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. ఆలయ ఏఈవో చంద్రశేఖర్ జస్టిస్ నరేందర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment