సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల నుంచి చంద్రబాబు, ఈ భూమ్మీద నుంచి రామోజీరావు నిష్క్రమించినప్పుడే రాష్ట్రంలో కుల రాజకీయాలకు విముక్తి లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ‘రామోజీకి ధైర్యం ఉంటే, ఆరోపణలకు ఆధారాలుంటే నా పేరు పెట్టి వార్త ప్రచురించాలి. భయం భయంగా ఊరు, పేరు లేకుండా దొంగరాతలు రాయడం కాదు.
ఈనాడు టీమ్ లేదా మీ కుల టీమ్‌ను పంపించి నాపై ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని ద్వారంపూడి సవాల్ చేశారు. రామోజీ తప్పుడు రాతలను ప్రజాక్షేత్రంలో ఉన్నందున ఖండించాల్సి వస్తోందన్నారు. తమ సామాజిక వర్గం మాత్రమే రాజకీయాలను శాసించాలనే కులపిచ్చితో రామోజీ, చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
‘అతడొక అరాచకం’ శీర్షికన గురువారం ఈనాడు ప్రచురించిన కథనంపై ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడలో మీడియాతో మాట్లాడారు. వాస్తవాలు చెబుతున్నందువల్లే ఉక్రోషంతో రామోజీ తనపై అభూత కల్పనలతో కథనాలను ప్రచురించారని ధ్వజమెత్తారు. రామోజీకి నిజాయితీ, నిబద్ధత ఉంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సీఐడీ విచారణకు హాజరు కాకుండా ఎందుకు ముఖం చాటేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఏమన్నారంటే..
♦ ఇటీవల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు నాపై నిరాధార ఆరోపణలతో తప్పుడు కథనాలను వెలువరిస్తున్నారు. కులమతాలకు అతీతంగా పదిమందికి సాయపడే గుణం కలిగిన రెడ్డి సామాజికవర్గాన్ని అన్ని వర్గాలు ఆదరిస్తుండటంతో తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజాప్రతినిధులుగా గెలుపొందుతున్నారు.
♦ ఎప్పుడూ మీ సామాజిక వర్గమే అధికారంలో ఉండాలా రామోజీ? ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబుతో కలసి దుష్ట గురువులా రాజకీయాల్లో కులచిచ్చు రేపారు. మార్గదర్శి కుంభకోణాన్ని వెలికి తీయడంతో రామోజీ పతనం మొదలైంది. ఆయన అక్రమ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోవడం ఖాయం. రామోజీకి వయసు అయిపోయింది. ఇప్పటితరం నీ ఆటలను సాగనివ్వదు.
♦ టీడీపీ పాలనలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు ప్రారంభించి కోట్లు దిగమింగారు. 30 వేల మంది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే నేను గ్రావెల్ తవ్వించా. అన్ని అనుమతులు తీసుకుని ప్రభుత్వానికి పన్నులు చెల్లించి 650 ఎకరాలను మెరక చేయించా. కోవిడ్ సమయంలో దగ్గరుండి పనులు చేయించా. పేదల ఇళ్ల స్థలాల కోసం దుమ్ములపేట, పర్లోపేట ప్రాంతాల్లో భూములను నా సొంత నిధులతో మెరక చేయిస్తే కబ్జా చేస్తున్నట్లు రామోజీ చిత్రీకరించారు.
♦ మా తాతల కాలం నుంచి 50 ఏళ్లుగా బియ్యం వ్యాపారంలో ఉన్నాం. రామోజీ సామాజిక వర్గానికి చెందిన సైరస్ కంపెనీ ప్రతినిధి వేల్పూరి శ్రీనివాస్ కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు.
♦ కోవిడ్ సమయంలో అధిక చార్జీలు వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై జరిమానా విధించేలా నేను కృషి చేస్తే కమీషన్లు వసూలు చేశానంటూ రామోజీ తప్పుడు కథనం ప్రచురించారు. నా విజ్ఞప్తి మేరకు ఒక స్నేహితుడు ఉచితంగా మంచాలు అందచేశారు. రోగుల అవసరాలను తీర్చగా నిరుపయోగంగా ఉన్న మంచాలను సింహాచలం పాదయాత్రలో నా వెంట ఉన్నవారి కోసం వినియోగించడంలో తప్పు ఎక్కడుంది?
♦ కాకినాడలో గంజాయి జాడ లేకుండా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే నాకు అక్రమ రవాణా అంటగడతారా?
‘ఈనాడు’ ప్రతులు దగ్థం...
ఎమ్మెల్యే ద్వారంపూడిపై తప్పుడు కథనాన్ని నిరసిస్తూ కాకినాడ రెవెన్యూ కాలనీ డంపింగ్ యార్డు వద్ద ‘ఈనాడు’ ప్రతులను దగ్ధం చేశారు. రామోజీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. రామోజీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కౌడా చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సిటీ అ«ధ్యక్షురాలు శివప్రసన్న, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ తదితరుల ఆధ్వర్యంలో కాకినాడ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment