ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు శనివారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాకంబరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించారు.
మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులు, భక్తుల నుంచి సేకరించిన కూరగాయలతో అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. తొలి రోజు రాత్రి 9.30గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు, పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుర్గమ్మ సేవలో హైకోర్టు న్యాయమూర్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.సుజాత, జస్టిస్ సుబ్బారెడ్డి, జస్టిస్ శ్రీనివాసరెడ్డి తదితరులు శనివారం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వేర్వేరుగా ఆలయానికి వచ్చిన న్యాయమూర్తులకు అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈఈ కె.వి.ఎస్.కోటేశ్వరరావు అమ్మవారి ప్రసాదం, శేషవ్రస్తాలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment