సాక్షి, అమరావతి: కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)ల ద్వారా పాడిరైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆక్వారైతులు, మత్స్యకారులకు కేసీసీల ద్వారా పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేస్తున్నారు. అదేబాటలో పశుకిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడిరైతులకు పాడిసంరక్షణ, నిర్వహణ కోసం హామీలేకుండా గరిష్టంగా రూ.1.60 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలివ్వాలని సంకల్పించారు. కార్డుల జారీకోసం ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో స్పెషల్ డ్రైవ్‌లకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే 45,652 మందికి పశుకిసాన్ క్రెడిట్ కార్డులు
పశుకిసాన్ క్రెడిట్ కార్డుల కోసం మత్స్యకారులు, ఆక్వారైతుల తరహాలోనే పాడిరైతులు స్థానిక ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగతంగానే కాకుండా గ్రూపులుగా ఏర్పడినా కార్డులు జారీచేస్తారు. ఇందుకోసం మే 1వ తేదీ నుంచి ఆర్బీకే స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్‌లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసే పాడిరైతులు ఎంతకాలం నుంచి పశుపోషణ చేస్తున్నారు.
ఎంత పాడి ఉంది. ఎంత పాల ఉత్పత్తి చేస్తున్నారు వంటి వివరాలను పశువైద్యాధికారితో ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 45,652 మందికి పశుకిసాన్ క్రెడిట్ కార్డులు జారీచేశారు. వైఎస్సార్ చేయూత, ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబి్ధతో పాడిపశువులు, సన్నజీవాలు కొనుగోలు చేసిన ప్రతి పాడిరైతుకు పశుకిసాన్ క్రెడిక్ కార్డు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. నాలుగేళ్లలో 2.67 లక్షల మంది పాడిరైతులకు జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల కింద మూగ, సన్నజీవాలను అందించారు. వీరందరికి ఈ కార్డులు జారీచేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నారు.
షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం
ఈ కార్డు ఆధారంగా ఎలాంటి హామీలేకుండా రూ.1.60 లక్షల వరకు రుణం ఇస్తారు. పశువులు, సన్నజీవాలకు షెడ్లు, మంచినీటి తొట్టెల నిర్మాణం, తాళ్లు, ఇతర సామగ్రితో పాటు పశుగ్రాసం కొనుగోలకు ఈ రుణాలను వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ రుణాలను కొత్త పశువుల కొనుగోలుకు ఉపయోగించకూడదు. కార్డు పొందే పాడిరైతుకు బీమా సదుపాయం కూడా ఉంటుంది. నాలుగేళ్లలో మత్స్యకారులు, ఆక్వారైతులకు 20 వేల కార్డులు జారీచేయగా, రూ.2,800 కోట్ల రుణ పరపతి కలి్పంచారు.
ప్రతి సీజన్‌లో ఆక్వారైతులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ రుణంలో మొదటి రూ.రెండు లక్షలను కేసీసీ రుణంగా పరిగణిస్తారు. కార్డుల జారీ, రుణపరపతి కోసం ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఆధారిత అప్లికేషన్ (ఆటోమేషన్)ను కూడా అభివృద్ధి చేశారు. జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు కేసీసీల జారీ, రుణాల మంజూరు వివరాలను ఆర్బీకేల్లోని పశుసంవర్ధక సహాయకుల ద్వారా అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ డ్రైవ్ వచ్చే మార్చి నెలాఖరు వరకు కొనసాగనుంది.
చదవండి: చింపేస్తాం.. పీకేస్తాం.. నారా లోకేష్ ఓవర్ యాక్షన్
Comments
Please login to add a commentAdd a comment