వస్త్ర దుకాణంలోకి దూరిన తాచు పామును పట్టుకున్న క్రాంతి
సాక్షి,జంగారెడ్డిగూడెం : పాము కనిపిస్తే మనకు ఒళ్లు జలదరిస్తుంది. వెంటనే ఆమడ దూరం పారిపోతాం. కానీ ఆ యువకుడు మాత్రం పాము కనిపిస్తే చాలు దాన్ని ఎంతో సులువుగా పట్టుకుని ప్రజల నుంచి హాని కలగకుండా సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతాడు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన చదలవాడ క్రాంతి కుమార్‌ను అందరూ ఆ ప్రాంతంలో పాముల సంరక్షకుడిగా పిలుస్తారు. ఏటా జూలై 16న ప్రపంచ పాముల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజుని పురస్కరించుకుని స్నేక్ సేవియర్‌గా పేరు తెచ్చుకున్న క్రాంతి గురించి తెలుసుకుందాం.
చిన్నప్పటి నుంచే ఆసక్తి
డిగ్రీ వరకు చదివిన క్రాంతి చిన్నప్పటి నుంచి వన్యప్రాణులకు హాని తలపెట్టకూడదనే ఆలోచనతో పెరిగాడు. ఎవరైనా వాటికి హాని కలిగిస్తే వారికి అవగాహన కల్పించేవాడు. చాలామంది పాములను చంపడం చూసి వాటిని రక్షించాలని నిర్ణయించుకున్నాడు. వాటిని సురక్షితంగా పట్టుకోవడంలో శిక్షణ పొందాడు. శిక్షణ అనంతరం విశాఖపట్నంలో ఉన్న స్నేక్ సేవియర్ సొసైటీలో పాములపై రీసెర్చ్ మొదలుపెట్టాడు. అతి తక్కువ కాలంలోనే పాములను సురక్షితంగా పట్టుకోవడంలో పేరుగాంచాడు.
అనేక గ్రామాల్లో పర్యటించి పాముల్ని చంపకుండా ఎలా వాటి నుంచి రక్షించుకోవాలనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. ఇంతవరకు జనావాసాలు, ఇళ్ల మధ్యకు వచ్చిన 10,900 పాములను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టాడు. పశ్చిమగోదావరి జిల్లాలో అనేక మండలాల్లో ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాము కనిపిస్తే వెంటనే గుర్తుకొచ్చేది క్రాంతి పేరే. 83869 84869, 80998 55153 నెంబర్లకు ఫోన్ చేయగానే ఆ ప్రాంతానికి వెళ్లి పామును పట్టుకుని సురక్షితంగా విడిచిపెడుతుంటాడు.
పాములతో పర్యావరణానికి మేలు
మొట్టమొదటి సారిగా కెనడాలో ప్రపంచ పాముల దినోత్సవాన్ని నిర్వహించారు. పాములనేవి పర్యావరణానికి మంచి చేస్తాయని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 3,458 సర్పజాతులు ఉండగా.. వీటిలో కింగ్ కోబ్రా, తాచుపాము, పొడపాము, కట్లపాము, రక్తపింజర విషపూరితమైనవి.
– చదలవాడ క్రాంతికుమార్, పేరంపేట
Comments
Please login to add a commentAdd a comment