ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, భద్రతా సిబ్బంది పనితీరును తరుచూ పర్యవేక్షించాలని కలెక్టర్లను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలతోనే ఆస్పత్రుల్లో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని సూచించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య సేవలపై మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కలెక్టర్‌లు స్పందించాలని సూచించారు.
అధునాతన పరికరాల కొనుగోలు, వాటి నిర్వహణను ఏపీఎంఎస్‌ఐడీసీ పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. పీహెచ్‌సీల నుంచి టీచింగ్ ఆస్పత్రుల వరకు అన్ని బయోమెడికల్ పరికరాల నిర్వహణను కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతున్నట్లు చెప్పారు. అదనంగా కావాల్సిన మహాప్రస్థానం వాహనాల విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఆర్డీవో, డీఎస్పీలతో కూడిన కమిటీలు ప్రైవేట్ వాహనాల మాఫియాను అడ్డుకోవడంతోపాటు స్థానిక ఆపరేటర్లతో చర్చించి వాహనాల రేట్లను అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు, మహాప్రస్థానం వాహనాలు, శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్, వ్యాక్సినేషన్, బయోమెట్రిక్ హాజరు, సిబ్బంది నియామకం తదితర అంశాలపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment