
తాదూర సందు లేదు.. మెడకో డోలు అన్నది ఒక సామెత. అలా ఉంది తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్యాక్టరీకి సంబంధించి చేస్తున్న ప్రతిపాదన. ఇది కూడా ఇంతవరకు లీకుల రూపంలోనే ప్రచారం చేస్తున్నారు తప్ప కాంక్రీట్‌గా ఆరంభం అయినట్లు కనిపించదు. ఇంకా కొన్ని రోజుల గడువు ఉంది కనుక అప్పుడు ఏమి జరుగుతుందో చూడవచ్చు. ఈలోగా ఏపీలో మాత్రం ఈనాడు ,తదితర తెలుగుదేశం మీడియా లు విపరీతమైన హైప్ ఇచ్చే యత్నం చేస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండన్న చందంగా పతాక శీర్షికలలో కథనాలు వండి వార్చుతున్నాయి.అదేదో కెసిఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసి, ఆయన వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చుచేసి కార్మికులకు సాయ పడనున్నట్లు ,ఆంద్రుల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించబోతున్నట్లుగా పిక్చర్ ఇస్తూ కొందరు పబ్లిసిటీ చేయడమే చిత్రంగా ఉంటుంది.
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతూ, అబద్దాలు ప్రచారం చేస్తున్న ఈనాడు మీడియా ఉక్కు సంకల్పం మనకేదీ అంటే బానర్ కధనాన్ని రాసేసింది. తెలంగాణకు ఉన్నపాటి శ్రద్ద అయినా లేదా అంటూ ప్రశ్నించి చెడరాసింది. కేంద్రాన్ని ప్రశ్నించడం చాతకాదా అని జగన్ ప్రభుత్వాన్ని అడిగేసింది. పోని జగన్ ప్రభుత్వంపై రాస్తే, రాసిందిలే , అసలుప్రైవేటైజ్ చేయాలన్న ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపైన , ప్రధాని మోదీపైన ఏమైనా రాశారా అని చూస్తే మాత్రం ఒక్క ముక్కరాస్తే ఒట్టు. మరి మోదీ అంటే ఈనాడు వణుకుతోందా? మార్గదర్శి అక్రమాలు బయటపడుతున్న తరుణంలో ఇలాంటి వార్తలు రాసి ప్రజలను మోసం చేయాలన్న తపన తప్ప ఇంకొకటి కనిపించదు.
గతంలో ఒకసారి బందరు ఓడరేవులో కొంత పెట్టుబడి పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. అంతే ఇదే తెలుగుదేశం, ఈనాడు వంటి పత్రికలు అప్పుడు ఏమి రాశాయి. ఇంకేముంది బందరు పోర్టును కెసిఆర్ కు అమ్మేస్తున్నారని ,రాసిచ్చేస్తున్నారని వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ను తెలంగాణ ప్రభుత్వం ఉద్దరించేసినట్లు రాస్తున్నారు. ఇలా ఉంది వీరి ద్వంద్వ నీతి. పోనీ ఈ రోజు రాసిన ఉక్కు సంకల్పం వార్త తెలంగాణలో ప్రచురించారా అని విచారిస్తే ఎక్కడా కనిపించలేదు. ఇక్కడే వీరి దుష్ట సంకల్పం అర్ధం అవుతుంది. తెలంగాణ ఏదో చేసేస్తున్నట్లు, ఏపీ ప్రభుత్వం ఏమి చేయనట్లు ప్రొజెక్టు చేయడమే వీరి లక్ష్యం అని అర్ధం చేసుకోవడం కష్టం కాదు.
కాకపోతే ఆంద్రులు అమాయకులని భావించి ఈనాడు మీడియా ఇలాంటి దిక్కుమాలిన స్టోరీలు అల్లుతోంది.ఒకవేళ మాటవరసకు తెలంగాణ ప్రభుత్వం విశాఖ స్టీల్ లోని మూడో బ్లాస్ట్ ఫర్నేస్ కు అవసరమైన ముడిసరుకుల సరఫరాకు అంగీకారం కుదుర్చుకుందని అనుకుందాం. అప్పుడు ఏమైనా లాభాలు వస్తే ,వాటిని తెలంగాణకు తీసుకువెళతారా? ఆంద్రలో ఖర్చు చేస్తారా? కచ్చితంగా తెలంగాణకే తీసుకువెళతారు. ప్రైవేటు సంస్థలు కూడా అదే పనిచేస్తాయి. అలాంటప్పుడు వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఏపీ మంత్రి గుడివాడ అమరనాధ్ దీనికి మంచి సమాధానమే ఇచ్చారు. అసలు ప్రైవేటైజేషన్ నే వ్యతిరేకిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం టెండర్ లో ఎలా పాల్గొంటుందని ప్రశ్నించారు.
పోనీ తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా అంత సామర్ద్యం ఉందా అని ఆలోచిస్తే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ నెలకు ఆ నెల ఇరవయ్యో తేదీ వరకు జీతాలే ఇవ్వలేకపోతున్నారు. అలాంటప్పుడు వేల కోట్ల పెట్టుబడి విశాఖలో ఎలా పెడతారు?నిజంగా ఆ ఆలోచన ఉంటే అధికారికంగానే ప్రకటించవచ్చు కదా?వారి సొంత మీడియాలో కాకుండా ఇతర మీడియాలలో వారు లీకులు ఇచ్చి ఎందుకు ప్రచారం చేసుకున్నారు. కేవలం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఈ గేమ్ ఆడుతున్నారా అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి సంస్థలోనే కొన్ని కోల్ బ్లాక్ లను ప్రైవేటు సంస్థలకు అప్పగించిన ప్రభుత్వం నష్టాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను కాపాడుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజంగానే వారికంత చిత్తశుద్ది ఉంటే ఏపీకి రావల్సిన ఆస్తులను ఇచ్చివేయవచ్చు కదా అని కొందరు అంటున్నారు.
విద్యుత్ సంస్థలు బకాయి పడ్డ సుమారు ఆరువేల కోట్ల రూపాయలు ఏపీకి ఇచ్చి వేయవచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అసలు విషయం ఏమిటి? విశాఖ స్టీల్ లో మూతపడిన మూడోనెంబర్ బ్లాస్ట్ పర్నేస్ ను పనిచేయించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దాని ప్రకారం ఎవరైనా ఆసక్తి ఉన్నవారు స్టీల్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ముడి ఇనుము, ఫెర్రో అల్లాయిస్ వంటి వాటిని సరఫరా చేసి ,తద్వారా ఉత్పత్తి అయ్యే స్టీల్ ఉత్పత్తులను తీసుకోవడం. అంటే ఒక విధంగా బార్టర్ సిస్టమ్ వంటిది. అంటే ఒక సరుకు ఇచ్చి ,మరో సరుకు తీసుకోవడం అన్నమాట.మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కు టెండర్ పిలిచారన్నట్లుగా కొన్ని వర్గాలు , తెలుగుదేశం వంటి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. తద్వారా విశాఖ కార్మికులను భయపెట్టడానికి, ఏపీలో ఓటర్లను కొంత ప్రభావితం చేయడానికి వారు తంటాలు పడుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పటికే కొన్ని ప్రైవేటు సంస్థలు విశాఖ ఉక్కుకర్మాగారంలోని ఆ ఫర్నేస్ ను సందర్శించి వెళ్లాయి. అవి ఎంత వరకు ఈ కాంట్రాక్టును నిర్వహించలేవినేనని సందేహం వ్యక్తం చేస్తూ స్టోరీలు వచ్చాయి. అదే సమయంలో జిందాల్ సంస్థ కూడా వస్తున్నదని, దానికి అప్పగిస్తే ,క్రమేపీ మొత్తం ప్రైవేటైజ్ అవుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తూ రాస్తున్నారు. అంటే సత్తాలేని కంపెనీలు రాలేవని, కాస్త కెపాసిటీ ఉన్న కంపెనీ వస్తే దానిని రానివ్వకుండా చేయడం ఎలా అన్నదానిపై కొన్ని వర్గాలు కృషి చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తెరపైకి వచ్చింది.
తొలుత మంత్రి కెటిఆర్ విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ను వ్యతిరేకిస్తున్నట్లు ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ తర్వాత టెండర్లలో పాల్గొంటున్నట్లు లీకులు ఇచ్చారు. అయితే సింగరేణి ద్వారా ఈ బ్లాస్ట్ ఫర్నేస్ కు అవసరమైన దానిలో పదిహేను శాతమే సమకూర్చగలుగుతారట. మిగిలినవాటి కోసం భారీ ఎత్తున నిధులు వ్యయం చేయాల్సి ఉంటుంది. దానిని తెలంగాణ ప్రభుత్వం భరించగలుగుతుందా? ఇప్పటికే తెలంగాణ లోని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎద్దేవ చేస్తూ ప్రకటనలు ఇచ్చాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసమో, ఆంద్రలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికో కెసిఆర్ ఈ వ్యూహం పన్నితే ఏపీలో ఈనాడు వంటి టిడిపి మీడియా సంస్థలు దానికి హైప్ ఇచ్చి ఏదో జరిగిపోతుందన్నట్లుగా వార్తలు ఇవ్వడం ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదని చెప్పక తప్పదు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్