గోల్‌మాల్‌ ‘బాబు’.. ఈసీని నమ్మేదేలా? | Ksr Comments On Andhra Pradesh Election Gol Maal Of EVM Machines | Sakshi
Sakshi News home page

గోల్‌మాల్‌ ‘బాబు’.. ఈసీని నమ్మేదేలా?

Published Fri, Aug 30 2024 12:30 PM | Last Updated on Fri, Aug 30 2024 6:32 PM

Ksr Comments On Andhra Pradesh Election Gol Maal Of EVM Machines

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ అపహస్యం పాలు అయినట్టేనా?. ఎన్నికల్లో రెఫరీగా ఉండి నిక్కచ్చిగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ లేదా ఎన్నికల ముఖ్య అధికారి ఒక రాజకీయ పార్టీతో కుమ్మ​కై తమకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు అన్న విషయం రాను రాను బలపడుతోందా?. తెలుగు దేశం, జనసేన, బీజేపీ.. కూటమికి శాసనసభ, లోకసభ ఎన్నికల్లో అసాధరణమైన సంఖ్యలో సీట్లు, ఓట్లు వచ్చిన తీరు చూసి అంతా బిత్తరపోయారు.

మొదట ఏమోలే! టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లు ఇచ్చిన సూపర్ సిక్స్ హమీలు పనిచేశాయని భావించారు. కానీ, ఆ తర్వాత వెల్లడైన అనేక విషయాలు దిగ్భాంత్రి కలిగించాయి. పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగినట్లు చూపడం, వైఎస్సార్‌సీపీ బలమైన చోట్ల అసలు ఓట్లు రాకపోవడం, పలువురు తాము వైఎస్సార్‌సీపీ ఓట్లు వేశామని, అయినా తమ బూత్‌లో ఇంత తక్కువ ఓట్లు ఎలా నమోదు అవుతాయని సందేహాలు వ్యక్తం చేయడం వంటివి జరిగాయి. పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓటింగ్ శాతం ఏకంగా 12.5 శాతం పెరగడాన్ని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘాలు తప్పుబట్టాయి.

ఇద్దరు ముగ్గురు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు ఈ ఓట్లు, మెజార్టీలు, ఈవీఎం బ్యాటరీ చార్జింగ్ పోలింగ్ నాటి కంటే కౌంటింగ్ నాటికి పెరిగిన తీరుపై అనుమానాలు వచ్చి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే కాకుండా నిబంధనల ప్రకారం నిర్ధిష్ట ఫీజును కూడా చెల్లించి రీ-వెరిఫికేషన్ కోరారు. అంటే దాని ప్రకారం ఈవీఎంలో ఆయా రాజకీయ పక్షాలకు నమోదైన ఓట్లు, వీవీప్యాట్ స్లిప్‌లలో రికార్డు అయిన ఓట్లకు సరిపోల్చడం అన్నమాట. ఈ రెండు మ్యాచ్ అయితే ఈవీఎంలపై ఎవరికీ అనుమానం రాదు. ఎన్నికల సంఘం తరపున పనిచేసిన జిల్లా అధికారులు కొందరు దీనిపై ప్రవర్తించిన తీరు, ఎన్నికల ముఖ్య అధికారి మీనా అప్పట్లో హడావుడిగా ఇచ్చిన అదేశాలు, ఈవీఎంలో డేటాను తొలగించారు అన్న సమాచారం, వీవీప్యాట్ స్లిప్‌లను బర్న్ చేశారు అన్న విషయం నిర్ధారణ అవ్వడంతో ఏపీలో కూటమి గెలుపులో ఈవీఎంల హ్యాకింగ్, టాంపరింగ్ వంటి అక్రమాలు జరిగి ఉండవచ్చన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది.

ఈ విమర్శలపై ఎన్నికల సంఘం నిజాయితీగా స్పందించడం లేదని స్పష్టం అవుతోంది. ఒంగోలు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్ధి బొత్స అప్పల నర్సయ్యలు కౌంటింగ్ జరిగిన కొద్ది రోజులకే రీ-వెరిఫికేషన్ కోరారు. దాన్ని గమనించారో మరి ఏదో కారణంతోనో, నలబైదు రోజుల పాటు ఉంచాల్సిన వీవీప్యాట్ స్లిప్‌లను బర్న్ చేయాలంటూ ఎన్నికల ఉన్నతాధికారి సర్క్యూలర్ జారీ చేసారు. ఇంకా ఎవరైనా ఆ స్లిప్‌లను బర్న్ చేయాకపోతే వెంటనే చేయాలని అదేశించారు. తొలుత ఆ సంగతి తెలియలేదు కానీ, ఒంగోలు, విజయనగరంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు పట్టుబట్టడంతో అనేక విషయాలు బయటకు వచ్చాయి.

మొదట ఫిర్యాదులు విత్‌డ్రా చేసుకోవాలని కోరుతూ వీరిపై ఒత్తిడి తేవడమే అనుమానాలకు తావు ఇచ్చింది. వారు తలోగ్గకపోవడంతో రీ-వెరిఫికేషన్ బదులు మాక్ పోలింగ్‌ను తెరపైకి తెచ్చారు. దీనిపై బాలినేని అభ్యంతరం చెప్పి హైకోర్టుకు వెలితే దీనిపై అక్కడ ఇప్పటికి తీర్పు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ఈ వ్యవహరంలో న్యాయవ్యవస్థ సైతం దురదృష్టవశాత్తు తాత్సార్యం చేస్తోంది. బాలినేని దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లడానికి సిద్దపడ్డారు. కానీ, హైకోర్టు తీర్పు ఇవ్వడం లేదు. దీనితో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇక విజయనగరం జిల్లాలో ఈవీఎం బాక్స్ తాళం కోసం గంటల తరబడి వెతుకులాట అశ్చర్యం కలిగిస్తోంది.

ఆ తర్వాత ఇక్కడ సైతం ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్‌ల వెరిఫికేషన్ బదులు మాక్ పోలింగ్ డ్రామాను అధికారులు ఎంచుకోవడం, అది ఎన్నికల సంఘం అదేశాల మేరేకే అని చెప్పడం కచ్చితంగా ఈ ఎన్నికల్లో గోల్ మాల్ జరిగిందన్న భావనకు అస్కారం ఇచ్చింది. పైగా ఈవీఎంలో డేటా తీసివేశామని, స్లిప్‌లను బర్న్ చేశామని, ఈసీ సూచన మేరకు చేశామని అధికారులు చెప్పడంతో ఏపీ ప్రజలు ఎన్నికల్లో దారుణమైన మోసం జరిగిందన్న అభిప్రాయానికి వస్తున్నారు. అందుకే ఇది ఈవీఎంల ప్రభుత్వం అన్న వ్యంగ్యోక్తులు విసురుతున్నారు. 2009లో ఈవీఎంలను వ్యతిరేకించి హ్యాక్ అవుతాయని ప్రచారం చేసిన చంద్రబాబు 2019లో ఓటమి తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లారు. అలాగే మరి కొందరు కూడా సుప్రీం కోర్టును అశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు వీవీప్యాట్‌ల వ్యవస్థను తెచ్చింది.

2024 ఎన్నికల తర్వాత ఇంత గందగోళం జరుగుతున్నా, టాంపరింగ్ అరోపణలు వస్తున్నా, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ నేతలు ఎవరు నోరు మెదపడం లేదు. ఇది కూడా జనంలో అనుమానం రేకెత్తించింది. విజయనగరంలో పోలింగ్‌నాడు ఈవీఎం బ్యాటరీలో 50 శాతం చార్జింగ్ ఉన్నట్టు సీసీ కేమేరాల్లో రికార్డు అయితే 21 రోజుల తర్వాత జరిగిన కౌంటింగ్‌లో బ్యాటరీ శాతం 99 శాతం చూపించడం చిత్రంగా ఉంది. దీనిపై పరిశీలన కోరితే బెల్ ఇంజనీరు ఏమో ఎన్నికల సంఘం ఇచ్చిన స్టాండర్డ్ అపరేటింగ్ ప్రోసిజర్స్‌లో బ్యాటరీ ప్రస్తావన లేదని తప్పించుకుంటున్నారు. ఈవీఎం డేటాను వీవీప్యాట్ స్లిప్‌ లతో లెక్కవేసి మ్యాచ్‌ చేసి చూపాలని అడిగితే ఆ డేటా కాని, స్లిప్‌లు కాని లేవని చేతులెత్తేశారు. ఇవి అన్ని చూస్తే ఏమనిపిస్తుంది.  కచ్చితంగా ఎన్నికల సంఘం అనండి, ఎన్నికల నిర్వహణలో ముఖ్య అధికారులు అనండి, కూటమి నేతలతో కుమ్మక్కు అయ్యారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది.

సింపుల్‌గా ఈవీఎంలో ఉన్న డేటాను, వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కవేస్తే సరిపోయే కేసును ఎన్నికల సంఘం ఇంత జఠిలంగా మార్చి అసలే మొత్తం డేటా, స్లిప్‌లు లేకుండా చేయడం దుర్మార్గం. గతంలో బ్యాలెట్ పేపర్స్ వ్యవస్థ ఉండేది. దాని వల్ల పోలింగ్‌లో గాని, కౌంటింగ్‌లో గాని జాప్యం జరుగుతుందని, కొందరు రిగ్గింగ్‌లకు పాల్పడుతున్నారని కౌంటింగ్‌లో అక్రమాలు చేస్తున్నారని భావించి ఈవీఎంల వ్యవస్థను ప్రవేశపెట్టారు. మొదటి రోజుల్లో ఈవీఎంలపై పెద్దగా అనుమానాలు రాలేదు. కానీ, ఆ తర్వాత కాలంలో సాంకేతిక పరిజ్ఢానం పెరగడం, హ్యాకింగ్‌ వ్యవస్థ రావడం, సైబర్ నేరగాళ్ల గురించి వినడం, ట్యాంపరింగ్‌కు అవకాశం వంటివాటి నేపధ్యంలో సందేహాలు వచ్చినా, ఎన్నికల సంఘం ఇలా ఎందుకు చేస్తుందిలే అని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల అధికారులు న్యాయబద్దంగా లేకుండా ఏపీలో టీడీపీ కూటమికి కొమ్ము కాయడం, చివరకు ఈవీఎంలో డేటా లేకుండా చేసినట్లు బయటపడడంతో ఇప్పుడు ప్రజల్లో సందేహాలు కాకుండా అక్రమాలపై ఒక నిర్ధారణ ఏర్పడింది.

లక్షల కిలోమీటర్ల దూరంలోని అంతరిక్షంలో ఉన్న స్పేస్ ఎక్స్‌ను టెక్నాలజీ ద్వారా భూమి మీద నుంచి మ్యానేజ్ చేస్తున్నప్పుడు.. నేల మీదే ఉన్న ఈవీఎంలను ట్యాంపర్ చేయడం పెద్ద కష్టమా అని ఒక న్యాయ నిపుణుడు వ్యాఖ్యనించారు. టీడీపీ జనసేనలు బీజేపీతో పోత్తు పెట్టుకోవడం, కేంద్రంలో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రావడం లేదన్న సర్వేలు వెలువడడంతో ఉన్నత స్థాయిలోనే ఈ అక్రమాలకు బీజం పడిందన్న సందేహలు వ్యక్తం అవతున్నాయి. ఇండియా కూటమి పక్షాలు, ఈవీఎంల అక్రమాలకు సంబంధించి బీజేపీపై ఆరోపణలు చేశాయి. దానికి తగ్గట్టుగా ఆంధ్ర, ఒడిశాలలో అశ్చర్యకరమైన రీతిలో ఫలితాలు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్ధులు ఈ ఇద్దరు ముగ్గురు అయినా ఈపాటి ప్రయత్నం చేయకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదామో! మళ్లీ బాలెట్‌ పత్రాల పద్దతే బెటర్ అన్న భావన ఏర్పడుతోంది.

గతంలో సీసీటీవీలు వంటివి లేకపోవడం వల్ల రిగ్గింగులకు అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఎక్కడ నుంచి అయినా పర్యవేక్షించే సిస్టమ్స్ రావడంతో ఈ రిగ్గింగులను అరికట్టవచ్చు. బ్యాలెట్ పత్రాల సమయంలో జరిగిన అక్రమాల కన్నా, ఈవీఎంల ద్వారా జరిగే మోసాలు మరింత ప్రమాదకరంగా మారాయన్న అబిప్రాయం ఏర్పడుతోంది. అమెరికా వంటి పెద్ద దేశాలలో సైతం బాలెట్ పత్రాలనే వాడుతున్నారు. భారతదేశంలో ఈవీఎంల వ్యవస్థ ద్వారా ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడింది.

ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈవీఎంల టాంపరింగ్ చేయవచ్చని వ్యాఖ్యానించినప్పుడు, ఇండియాలో అది జరదని ఈసీ జవాబు ఇచ్చింది. కానీ, ఆ తర్వాత పరిణామాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈసీ పారదర్శకంగా లేదనిపిస్తుంది. పన్నెండు శాతం ఓట్లు పెరగడం నుంచి డేటా తీసివేయడం, వీవీప్యాట్ స్లిప్‌ల బర్న్ వరకు వచ్చిన అభియోగాలపై ఎన్నికల కమిషన్ నోరు విప్పకపోవడం మరింతగా సంశయాలకు ఆస్కారం ఇస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసినవారే భక్షిస్తున్నారా అన్న ప్రశ్న ఆవేదన కలిగిస్తుంది. ఎప్పటికైనా ఎన్నికల సంఘం దీనిపై స్పందిస్తుందా? ఏమో చెప్పలేం.

– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement