
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): తెలుగువారి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)అని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరచిన వారికి ఎన్టీఆర్ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.
లక్ష్మీపార్వతి మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి చరిత్ర సృష్టించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ శతజయంతి ప్రత్యేక సంచికను లక్ష్మీపార్వతి ఆవిష్కరించారు. ముగ్గురికి జీవిత సాఫల్య పురస్కారాలు, 30 మందికి కీర్తి పురస్కారాలు అందజేశారు.
ఫిలంత్రోఫిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజా యోనా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్, డ్రీం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మేదర సురేష్, రంగస్థల నటుడు గుంటి పిచ్చయ్య, జాతీయ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత పారుపల్లి సురేష్, పర్యావరణ వేత్త చిలుకూరి శ్రీనివాస్‌రావు, పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు చిలుముల బాల్‌రెడ్డి, సాహితీవేత్తలు గూటం స్వామి, కొల్లి రమావతి పాల్గొన్నారు.