
వాహనాలు రాకపోవడంతో తప్పిన ముప్పు
శ్రీశైలం ప్రాజెక్ట్: మంగళవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా శ్రీశైలం డ్యాంకు సమీపంలోని ఘాట్ రోడ్డులో బుధవారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడ్డాయి. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం పైభాగంలోని హైదరాబాద్–శ్రీశైలం రహదారిలో కొండచరియలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.
ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వర్షాకాలంలో డ్యాం వ్యూ పాయింట్ నుంచి లింగాలగట్టు, ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం నుంచి ఈగలపెంట వరకు వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, టూవీలర్‌పై వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని అధికారులు సూచించారు.
కాగా, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా శ్రీశైలం మండలంలోని సున్నిపెంట, లింగాలగట్టు గ్రామాల్లో వరదనీరు పొంగి పొర్లింది. మండలంలో 130.80 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. సున్నిపెంటలోని మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయ ప్రహారీ గోడ కొంత భాగం కూలిపోయింది.