
రేపల్లె (గుంటూరు): ఆ వలస కూలీలంతా కలిసే వచ్చారు. అగ్ని కీలల రూపంలో విరుచుకుపడిన ఆ కాళరాత్రి తమలో ఆరుగుర్ని సజీవ దహనం చేయడంతో భయకంపితులయ్యారు. అస్థికలుగా మారిన తోటి వారికి బరువెక్కిన హృదయాలతో అంత్యక్రియలు జరిపించారు. ఘోర ప్రమాదం మిగిల్చిన విషాదాన్ని తట్టుకోలేక.. తమతో వచ్చిన వారు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక విలపిస్తూనే సొంతూళ్లకు పయనమయ్యారు.
గుంటూరు జిల్లా లంకెవానిదిబ్బ గ్రామంలోని బెయిలీ ఆక్వా ఫామ్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర ప్రమాదంలో సజీవ దహనమైన ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన యువకులు నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అíస్థికలకు ఘటనా స్థలంలోనే ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి కూలీలు అదే గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
బావురుమన్న తల్లిదండ్రులు, బంధువులు
ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల తల్లిదండ్రులు, బంధువులు ఒడిశా నుంచి శనివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని కీలల్లో కాలిబూడిదైన అస్థికలను చూసి బావురుమన్నారు. మమ్మల్ని పోషించడం కోసం ఇంత దూరం వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ రోదించారు. వారితోపాటు వచ్చిన ఒడిశాలోని గోన్పూర్ ఎమ్మెల్యే రఘునాథ్ గుమెంగో ప్రమాదానికి గల కారణాలను ఇక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన గదిలోంచి బయటపడ్డ నలుగురు కూలీల పరిస్థితిపై ఆరా తీశారు.
అనంతరం మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని అధికారులు, బెయిలీ ఆక్వా ఫామ్ యాజమాన్యాన్ని కోరారు. ఒడిశా నుంచి మొత్తం 25 మంది వలస కూలీలు ఆక్వా ఫామ్‌లో పని చేసేందుకు 15 రోజుల క్రితం రాగా.. గురువారం రాత్రి 10 మంది ఒక గదిలోను, 15 మంది మరో గదిలోను నిద్రించిన విషయం విదితమే. 10 మంది నిద్రించిన గదిలో ఆరుగురు అగ్ని కీలల్లో సజీవ దహనం కాగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందటంతో భయాందోళనకు గురైన మిగిలిన 19 మంది కార్మికులు శనివారం సాయంత్రం తమ వారు లేరన్న బాధతో రోదిస్తూ స్వగ్రామాలకు పయనమయ్యారు.
సమగ్ర విచారణకు డిమాండ్
ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. శనివారం లంకెవానిదిబ్బ గ్రామానికి చేరుకున్న సీపీఎం, సీపీఐ (ఎంఎల్) నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఆరుగురి మృతిపై సమగ్ర విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. ఇదిలావుండగా.. ప్రమాదానికి రొయ్యల చెరువు యజమాని నిర్లక్ష్యమే కారణమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు గఫూర్, కార్యదర్శి నరసింగరావు శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. యజమానిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment