అమలాపురం టౌన్: కాపు ఉద్యమ సమయంలో పట్టణ పోలీస్‌స్టేషన్ ముట్టడికి సంబంధించి టీడీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో రాష్ట్ర కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు 30 మంది కాపు నేతలు గురువారం అమలాపురంలోని జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ముద్రగడతో పాటు రాష్ట్ర కాపు ఉద్యమ నాయకులు నల్లా విష్ణుమూర్తి, కల్వకొలను తాతాజీ, నల్లా పవన్‌కుమార్, సూదా గణపతి, ఆకుల రామకృష్ణ తదితరులు కోర్టుకు వచ్చారు.
టీడీపీ ప్రభుత్వం కాపులపై పెట్టిన అక్రమ కేసులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2022 ఫిబ్రవరిలో ఎత్తివేయించారు. అక్రమ కేసులతో అవస్థలు పడుతున్న కాపు నాయకులకు విముక్తి కల్పించారు. అప్పట్లో ప్రభుత్వం జీవో నంబర్ 120 ద్వారా ఈ కేసులకు పుల్‌స్టాప్ పెట్టింది. ముద్రగడ పద్మనాభం గతంలో చట్టసభలకు ప్రాతినిథ్యం వహించిన నేత కావడంతో ఈ కేసును తొలుత విజయవాడ ప్రజా ప్రతినిధులు కేసుల కోర్టుకు బదిలీ చేశారు.
ప్రస్తుతం తాను మాజీ మాత్రమేనని, ఈ కేసును అమలాపురం కోర్టుకు బదిలీ చేయాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించారు. దీంతో కేసు అమలాపురం జ్యూడీషీయల్ మేజిస్ట్రేట్ కోర్టుకు బదిలీ చేశారు. మేజిస్ట్రేట్ ఎ.హిమబిందు ఎదుట ఆ 30 మంది కాపు ఉద్యమ నాయకులు గురువారం హాజరయ్యారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తివేసిన జీవోను మేజిస్ట్రేట్ పరిశీలించి కేసును కొట్టేసినట్టు వెల్లడించారని అమలాపురం పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్ రాజశేఖర్ తెలిపారు.
ఈ సందర్భంగా కాపు నాయకులు అమలాపురం కోర్టుల సముదాయం ఎదుట హర్షం వ్యక్తం చేశారు. అప్పట్లో కేసులు ఎత్తివేస్తూ జీవో జారీ చేసి, ఇప్పుడు తమను కేసుల నుంచి విముక్తి కల్పించిన సీఎం జగన్‌కు కాపు ఉద్యమ నేత సూదా గణపతి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment