
నారాయణవనం (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని సింగిరికోన ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం చిరుతపులి దాడిలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు (58), మంజులాదేవి (48) ద్విచక్ర వాహనంపై సింగిరికోనకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. నారాయణవనం నుంచి సుమారు 6.5 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలోని ఆలయానికి అర కిలోమీటరు దూరంలో వెదురు పొదల వద్ద వీరిపై చిరుతపులి దాడి చేసింది. ద్విచక్ర వాహనంపై దూకిన చిరుత మంజులాదేవి తలపై పంజాతో గాయపరచింది. కుదుపుతో కింద పడిన సుబ్రహ్మణ్యంకు గాయాలయ్యాయి.
అదే సమయంలో ఆలయ దర్శనానికి వస్తున్న భక్తులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత సమీపంలోని పొదల్లోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన మంజులాదేవి, సుబ్రహ్మణ్యంలను పుత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంజులాదేవికి సుమారు 25 కుట్లు పడ్డాయి. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలో ఆలయ దర్శనానికి వెళ్తున్న నగరికి చెందిన దంపతులపై మరోసారి చిరుత దాడికి యత్నించింది. వీరు తప్పించుకుని ఆలయానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సింగిరికోనలోని భక్తులను ఖాళీ చేయించారు. ప్రస్తుతం సింగిరికోనకు రాకపోకలను నిషేధించామని, తదుపరి అనుమతులు వచ్చేవరకు ఎవరూ రావొద్దని ఎస్‌ఐ ప్రియాంక మీడియా ద్వారా భక్తులకు సూచించారు. అటవీ సమీప గ్రామాల్లో వలంటీర్ల ద్వారా అప్రమత్తం చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment