రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హరి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): న్యాయవాదులు మధ్యవర్తిత్వ పద్ధతులపై మెళకువలు పెంపొందించుకోవడం ద్వారా కక్షిదారులకు తక్కువ ఖర్చుతో సత్వర న్యాయాన్ని అందించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవినాథ్ తిల్హరి అన్నారు. మధ్యవర్తిత్వం మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు న్యాయవాదులు ఎక్కువ దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఏపీ న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యాన గుంటూరు మెడికల్ కళాశాలలో శనివారం మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సును ప్రారంభించిన జస్టిస్ రవినాథ్ తిల్హరి మాట్లాడుతూ పెరిగిపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక మంచి అవకాశమని చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని వివరించారు. వ్యాపార, కుటుంబ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే ఇరుపక్షాలకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. మధ్యవర్తిత్వంపై నెలకొన్న అపోహలు వీడాలని, ఈ విధానాన్ని ప్రజల ముంగిటకు తీసుకువెళితే న్యాయవాదులకు మరిన్ని అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ ద్వారా కూడా మధ్యవర్తిత్వం: జస్టిస్ రావు రఘునందన్‌రావు
సదస్సు ముగింపు సెషన్‌లో ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ చైర్మన్ జస్టిస్ రావు రఘునందన్‌రావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ప్రత్యేక చట్టం చేశారని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా కూడా మధ్యవర్తిత్వం నిర్వహించే వెసులుబాటు ఉందని చెప్పారు. ఏపీ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ సభ్య కార్యదర్శి ఎం.బబిత మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై ఇటీవల వస్తున్న మార్పులు, కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు.
ఇప్పటి వరకు అన్ని బార్ అసోసియేషన్లలో, జిల్లా, మండల, హైకోర్టు స్థాయిల్లో నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి, ఏపీ హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి, ఏపీ న్యాయసేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్.అమర రంగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి, సీనియర్ ట్రైనర్స్ రత్నతార, అరుణాచలం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment