సింగరాయకొండ వద్ద మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి
సింగరాయకొండ: వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ల నిర్మాణాలను త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ వద్ద, బాపట్ల జిల్లాలోని కొరిశపాడు–రేణంగివరం మధ్యలో ఏర్పాటు చేసిన విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్‌లను జాతీయ రహదారి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు.
సింగరాయకొండ వద్ద పరిశీలన సందర్భంగా మాగుంట మాట్లాడుతూ విమానాల ల్యాండింగ్ ప్రాజెక్టులు దేశంలో 13 మంజూరు కాగా, వాటిలో ప్రకాశం జిల్లా పరిధిలో ఒకటి, బాపట్ల జిల్లా పరిధిలో మరొకటి ఉన్నాయని, ప్రస్తుతం ఈ రెండూ చివరి దశలో ఉన్నాయన్నారు. సింగరాయకొండ వద్ద గల ప్రాజెక్టుకు అదనంగా 8.50 ఎకరాల స్థల సేకరణ చేయాల్సి ఉందని, అదనంగా సిమెంటు రోడ్లు నిర్మించాల్సి ఉందని ఎంపీ మాగుంట తెలిపారు. అందుకు రూ.40 కోట్ల అదనపు బడ్జెట్ అవసరమన్నారు.
నిధుల మంజూరుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్టు చెప్పారు. ప్రధాని కార్యాలయం నుంచి అందిన ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టేందుకు ఎయిర్‌ఫోర్స్, జాతీయ రహదారి అధికారులు, పైలెట్లు వచ్చినట్టు తెలిపారు. సింగరాయకొండ ప్రాజెక్టు నిర్మాణంలో మలుపులుండటంతో ప్రాజెక్టు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని, అయితే ఈ ప్రాజెక్టు వెనక్కి పోకుండా పూర్తి చేసేందుకు జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ కొన్ని సూచనలు చేశారని, అందుకు ఎయిర్‌ఫోర్స్ అథారిటీ అధికారులు కూడా ఆమోదం తెలిపారని మాగుంట వెల్లడించారు. ఎయిర్‌ఫోర్స్ అథారిటీకి చెందిన వీఎం రెడ్డి, అశోక్‌బాబు, ఆర్‌ఎస్ చౌదరి, వినోద్‌వాన్యా, ఆదిత్యదేశ్, జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ గోవర్దన్, పార్టీ నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment