మాట్లాడుతున్న ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు
సాక్షి, అమరావతి: చేనేత ఉత్పత్తులపై పెరుగుతున్న మక్కువను ఆసరా చేసుకుని విక్రయాలు మరింత పెంచుకునేందుకు దృష్టి సారించాలని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు సూచించారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్స్, షోరూం మేనేజర్లు, అధికారులతో గురువారం రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. చిల్లపల్లి మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకుని ఆప్కో విక్రయాలను పెంచేలా మార్కెటింగ్ సిబ్బంది బాధ్యతలు తీసుకోవాలని కోరారు. రానున్న పండుగల సీజన్ దృష్ట్యా ప్రతి ఒక్క అధికారి వ్యక్తిగతంగా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు.
చేనేత రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిల్లపల్లి సూచించారు. చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండీ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ఆప్కో ఆధ్వర్యంలో నూతన విక్రయశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఇటీవల ప్రారంభించిన ఒంగోలు షోరూమ్‌కు మంచి స్పందన వస్తుందన్నారు. త్వరలో గుంటూరు, కడపలో నూతన విక్రయశాలలు అందుబాటులోకి రానున్నాయన్నారు. చేనేత జౌళి శాఖ సంయుక్త సంచాలకులు, ఆప్కో జీఎం కన్నబాబు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు, ఉపసంచాలకులు మురళీ కృష్ణ, ఆప్కో సీనియర్ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, ప్రత్యేక అధికారి జగదీశ్వరరావు తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment