handloom products
-
కళల కలనేత.. చేనేత
సాక్షి, అమరావతి: చేనేత రంగం పూర్వవైభవం సంతరించుకుంటోంది. స్వదేశీ నినాదం ఊపందుకోవడంతో దేశవ్యాప్తంగా చేనేతకు క్రేజ్ పెరుగుతోంది. ప్రతి భారతీయుడు కొనుగోలు చేసే దుప్పట్లు, టవల్స్, కర్టెన్లు, గలీబులు, చీరలు, ప్యాంట్లు, షర్టులు వంటి వస్త్రాల్లో కనీసం 15 నుంచి 20 శాతం చేనేత కార్మికులు తయారు చేసినవి వాడగలిగితే.. ఆ రంగానికి ఊతమిచ్చినట్టేననే బలమైన నినాదం ప్రజల్లోకి వెళ్లింది. మన ప్రాచీన సాంస్కృతిక సంపద, వారసత్వం నిరంతరం జీవించగలిగేలా చేనేత రంగానికి ఊతమిచ్చే చర్యలు ఇటీవల దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్నాయి. అన్నిటికన్నా మిన్నగా ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అంతేకాకుండా చేనేత రంగానికి ఊతమిచ్చే అనేక చర్యలు చేపట్టింది. ఫలితంగా దేశవ్యాప్తంగా తెలుగు చేనేత కార్మికులు మార్కెట్లో పోటీ పడుతున్నారు. చేనేత పేరు పలకగానే.. పట్టుపావడా కుచ్చిళ్లు కాళ్లకు అడ్డం పడుతున్నా పరుగులు ఆపని పకపక నవ్వుల పాపాయి గుర్తు రాకుండా ఎలా ఉంటుంది. ఐలారం.. చీరాల పేరాల సుతిమెత్తని చీరల్లో అమ్మ మడతపెట్టి తెచ్చిన పుట్టింటి జ్ఞాపకాలు ఎలా మరిచిపోగలం. చేనేత మాటెత్తగానే.. వెంకటగిరి జరీ వెలుగులు.. మంగళగిరి ఫ్యాన్సీ జిలుగులు.. ఉప్పాడ.. ధర్మవరం పట్టుచీరలు, పావడాలు.. పొందూరు ఖద్దరు.. పెడన కలంకారీ అద్దకాలు.. గూడవల్లి చావిట్లో మగ్గం చప్పుళ్లు.. రాజోలు, అంబాజీపేట వాకిళ్లలో గంగాళాల్లో నానబోసిన రంగురంగుల దారాల కండెలు.. ఇంటిముందు రంగులద్దిన తడి నూలు ఆరబోతలు.. పడుగు–పేకల కలబోతతో నాజూకు కలనేత కళ్లముందు ఇట్టే కదలాడుతాయి. ఏపీలో అద్భుత నేత ► ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో చేనేత కేంద్రాలు అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. ఒక్కో చోట ఒక్కోతరహా అద్భుతమైన నేతతో ఆకట్టుకుంటున్నాయి. ► పెడన, మచిలీపట్నంలలో సహజసిద్ధంగా తయారు చేసిన రంగులతో కాంతులీనే అద్దకం వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. స్థానికంగా ఉండే చెట్లు, పువ్వుల నుంచి రంగుల సారం, బంక మన్ను, నదులలోని ఇసుక నుంచి రసాయనాలు తయారు చేసి వాటిని వస్త్రాలకు బ్లాక్ ప్రింట్స్‌తో అద్దకం చేసే మన కళాకారులు అనేక అవార్డులను సైతం దక్కించుకున్నారు. ► వెంకటగిరి జరీ, మంగళగిరి ఫ్యాన్సీ, పట్టు చీరలు, కాటన్ వస్త్రాలు, పెడన కలంకారీ అద్దకాలు, పొందూరు ఖద్దరు వంటి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలోని చేనేత కళాకారుల సొంతం. ► శ్రీకాళహస్తిలో హ్యాండ్ ప్రింట్స్ (చేత్తో గీసే డిజైన్లు) ప్రత్యేకం. వారి కళా నైపుణ్యానికి జాతీయ అవార్డులు సైతం దక్కాయి. ► ఉప్పాడ జాందాని జరీ చీరలు, ధర్మవరం కాటన్, పట్టు చీరలకు ప్రత్యేకం. బ్లాక్–ప్రింట్స్(కలంకారీ) చేనేతలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ఘనమైనది. ఒక్కో చోట.. ఒక్కో రకం భారతదేశంలో దాదాపు 150 చేనేత ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్థారించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మైసూరు, ఒడిశా,బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, సూరత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లోని అనేక చేనేత కేంద్రాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన నేత ప్రత్యేకం. ఇక్కత్, జాందాని, పట్టు, జరీ చీరలు టై–డై కలంకారీ, పుల్కారి, ఢకై, బాలుచరి సిల్క్, మూగా సిల్క్, పటోల డిజైన్, చందేరి సిల్క్, పైథాని సిల్క్, కోటా పేపర్ సిల్క్, టసర్ సిల్క్, ఖాదీ సిల్క్, మైసూరు సిల్క్, కాశ్మీర్ సిల్క్, ఎరిముడి సిల్క్, కాశ్మీర్ పష్మినా, శాహ్తూష్ పల్చని ఉన్ని వంటి ఉత్పత్తులకు నిరంతరం డిమాండ్ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల గిరిజన జాతులు రకరకాల చిహ్నాల రంగుల వస్త్రాలు, బిహార్ మధుబని, మహారాష్ట్ర వర్లి డిజైన్లతోపాటు ఆయా రాష్ట్రాల సంప్రదాయ దుస్తులకు చేనేత ఊతమిస్తోంది. నిత్య నూతన డిజైన్లతో.. నిత్య నూతనమైన డిజైన్లతో చేనేత సంప్రదాయం కొత్త పుంతలు తొక్కుతోంది. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను బట్టి.. మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా చేనేత కళాకారులు నైపుణ్యాలను పెంచుకుంటూ పోటీ మార్కెట్లో నిలదొక్కుకుంటున్నారు. భారతీయ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ఘన చరిత్రే ఉంది. పురాతన కాలం నుంచీ భారతీయ చేనేత వస్త్రాలు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవి. సుమారు 2 వేళ్ల ఏళ్ల క్రితం ‘హంస’ డిజైన్లతో కూడిన భారతీయ వస్త్రాలు ఈజిప్టులోని కైరో నగరంలో లభ్యమయ్యాయి. అగ్గిపెట్టెలో పట్టే మస్లిన్ చీరలను నేసిన ఘనత కూడా భారతీయులదే. 1905 ఆగస్టు 7న కోల్‌కతాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభం కాగా.. విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన స్వాతంత్య్ర ఉద్యమకారులు చేనేత తదితర స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని పిలుపునిచ్చారు. దేశంలో కుటీర పరిశ్రమగా భాసిల్లుతున్న చేనేత రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 70 లక్షల మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నట్టు అంచనా. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న చేనేత ఉత్పత్తుల్లో 90 శాతం మన దేశానికి చెందినవే కావడం విశేషం. -
చేనేతను ప్రజలకు చేరువ చేయండి
సాక్షి, అమరావతి: చేనేత ఉత్పత్తులపై పెరుగుతున్న మక్కువను ఆసరా చేసుకుని విక్రయాలు మరింత పెంచుకునేందుకు దృష్టి సారించాలని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు సూచించారు. విజయవాడ ఆప్కో కేంద్ర కార్యాలయంలో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్స్, షోరూం మేనేజర్లు, అధికారులతో గురువారం రాష్ట్ర స్థాయి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. చిల్లపల్లి మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల పోటీని తట్టుకుని ఆప్కో విక్రయాలను పెంచేలా మార్కెటింగ్ సిబ్బంది బాధ్యతలు తీసుకోవాలని కోరారు. రానున్న పండుగల సీజన్ దృష్ట్యా ప్రతి ఒక్క అధికారి వ్యక్తిగతంగా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. చేనేత రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిల్లపల్లి సూచించారు. చేనేత, జౌళి శాఖ సంచాలకురాలు, ఆప్కో ఎండీ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. ఆప్కో ఆధ్వర్యంలో నూతన విక్రయశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఇటీవల ప్రారంభించిన ఒంగోలు షోరూమ్‌కు మంచి స్పందన వస్తుందన్నారు. త్వరలో గుంటూరు, కడపలో నూతన విక్రయశాలలు అందుబాటులోకి రానున్నాయన్నారు. చేనేత జౌళి శాఖ సంయుక్త సంచాలకులు, ఆప్కో జీఎం కన్నబాబు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావు, ఉపసంచాలకులు మురళీ కృష్ణ, ఆప్కో సీనియర్ మార్కెటింగ్ అధికారి రమేష్ బాబు, ప్రత్యేక అధికారి జగదీశ్వరరావు తదితరులు మాట్లాడారు. -
చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి: వైవీ సుబ్బారెడ్డి
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విన్నపం న్యూఢిల్లీ: జౌళి రంగంపై ఆధారపడ్డ పేదల జీవనోపాధిని కొనసాగించేలా వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. మంగళవారం ఆయన ఈమేరకు జైట్లీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘‘టెక్స్‌టైల్స్‌పై 5 శాతం జీఎస్టీ విధించిన నేపథ్యంలో అఖిల భారత టెక్స్టైల్ సమాఖ్య పలు రాష్ట్రాల్లో జూన్ 27, 28, 29 తేదీల్లో బంద్ నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బట్టలను పన్ను పరిధిలోకి తేలేదు. పేదలకు సహేతుకమైన ధరల్లో దుస్తులు అందాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు పన్ను పరిధిలోకి తేలేదు. జీవనోపాధి కోసం లక్షలాది మంది వ్యాపారులు, టెక్స్టైల్ వర్తకులు ఈ రంగంపై ఆధారపడ్డవారు. వీరు పెద్దగా చదువుకున్న వారు కాదు. మహిళలు కూడా వారి భర్తలకు తోడుగా వస్త్రాలు, చీరలు, తదితర దుస్తులు అమ్ముతూ జీవోనోపాధి అందుకుంటున్నారు. చీరలు, ఇతర వస్త్రాలపై చేతి పని, యంత్రపు పని, ఫినిషింగ్ వర్క్ వంటి వివిధ పనులు చేస్తూ నిరుపేదలు తమ జీవనోపాధిని సాగిస్తున్నారు. అందువల్ల 5 శాతం జీఎస్టీ విధింపు వల్ల వీరందరినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సరికాదు. అంతేకాకుండా వీరందరూ తమ లావాదేవీలను నిక్షిప్తం చేస్తూ వారి రిటర్నులను కంప్యూటరీకరణ ద్వారా సమర్పించగలరని ఎలా ఆశించగలం? ఇది సాంకేతికంగా సాధ్యం కాదు. దీని కారణంగా వస్త్ర వ్యాపారులు పూర్వ స్థితిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్వ స్థితికి తేలేని పక్షంలో వారంతా జౌళి రంగంలో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల రానున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి వస్త్రాలపై 5 శాతం జీఎస్టీని తొలగించాలని కోరుతున్నా...’’ అని పేర్కొన్నారు. గ్రానైట్ మెటీరియల్ పై జీఎస్టీ రేటును పునఃపరిశీలించాలి.. గ్రానైట్ మెటిరియల్‌పై 28 శాతం జీఎస్టీ విధించే అంశంపై పునః పరిశీలించాలని వైవీ సుబ్బారెడ్డి జైట్లీని కోరారు. ఈ అంశంపై మే 27నే లేఖ రాసినట్టు గుర్తు చేశారు. ‘‘కరువు జిల్లా అయిన ప్రకాశం జిల్లా నుంచి నేను ప్రాతినిథ్యం వహిస్తున్నా. ఇక్కడ చిన్నతరహా పరిశ్రమ యూనిట్లుగా గ్రానైట్ యూనిట్లు నడుస్తున్నాయి. నాణ్యమైన గ్రానైట్ ఎగుమతి అవుతుండగా మిగిలిపోయిన, తిరస్కరణకు గురైన గ్రానైట్ తక్కువ రేట్లకు ఇక్కడ అమ్ముతున్నారు. అందువల్ల ఇలాంటి గ్రానైట్ మెటిరియల్‌పై కూడా 28 శాతం పన్ను విధించడం సరికాదు. అంతేకాకుండా ఇలాంటి మెటిరియల్‌ను మధ్య తరగతి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు. ప్రధాన మంత్రి గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ పరిశ్రమలపై నిరుపేదలు జీవనోపాధి కోసం ఆధారపడుతున్నారు. ప్రభుత్వం 28 శాతం పన్ను విధిస్తే డిమాండ్ తగ్గి ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. గ్రానైట్ పరిశ్రమ ఇప్పటికే కృత్రిమ గ్రానైట్, సెరామిక్ కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. అందువల్ల ఈ పరిశ్రమ మనగడ సాధించాలంటే 28 శాతం జీఎస్టీ నుంచి 5 శాతం జీఎస్టీ పరిధిలోకి తేవాలని పరిశ్రమ కోరుతోంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం వెలువరించాలని కోరుతున్నా..’’ అని పేర్కొన్నారు. -
యువత చేనేత ధరించాలి!
జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ సాక్షి, చెన్నై: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ పథకాల ద్వారా అందే నిధులను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తామని చెప్పారు. తొలి జాతీయ చేనేత దినోత్సవం చెన్నై మద్రాసు యూనివర్సిటీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. స్వాతంత్య్రోద్యమంలో విదేశీ వస్తు బహిష్కరణ చేసిన రోజును చిరస్మరణీయం చేసేందుకే ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్ణయించామని తెలిపారు. చేనేతను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు, చేనేత కార్మికులకు సరైన ప్రతిఫలం లభించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. సినిమాల ద్వారా చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పించాలని సినీ రంగాన్ని కోరారు. యువత చేనేతను ధరించాలని పిలుపునిచ్చారు. భారతీయ చేనేత పరిశ్రమకు సరైన బ్రాండింగ్ లేదన్నారు. చేనేత ఉత్పత్తులు ఈ కామర్స్‌ను ఉపయోగించుకుని తద్వారా ప్రపంచ మార్కెట్‌కు చేరాలని సూచించారు. ఈ కార్యకమాన్ని చెన్నైలో నిర్వహించడంపై స్పందిస్తూ.. జాతీయ ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమాలను ఢిల్లీలో కాకుండా దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో నిర్వహించాలన్నది తన ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మోదీ ప్రసంగించారు. 2012-14 మధ్యకాలంలో చేనేత రంగంలో అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన 72 మందికి ప్రధాని అవార్డులు ప్రదానం చేశారు. 16 మంది సంత్ కబీర్ అవార్డు కింద రూ.6 లక్షల నగదు, బంగారు పతకం, ప్రశాంసాపత్రం.. 56 మంది జాతీయ అవార్డుల కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం అందుకున్నారు. సీఎం జయ సందేశాన్ని మంత్రి పన్నీర్ సెల్వం చదివి వినిపించారు. ఈ సందర్భంగా మోదీ.. ‘ఇండియా హ్యాండ్లూమ్’ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య, కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్‌కుమార్ కంగ్వార్, కేంద్ర నౌకాయాన మంత్రి పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు రాష్ట్ర మంత్రులు పన్నీర్‌సెల్వం, గోకుల ఇందిర, దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు పాల్గొన్నారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ⇒ చేనేతలో సృజనాత్మక డిజైన్లకు, బ్రాండ్ల రూపకల్పనకు టెక్స్టైల్ శాఖ పురస్కారాలందించాలి. ⇒ ఖాదీ ధరించాలన్న తన గత సంవత్సర పిలుపుతో ఖాదీ అమ్మకాలు 60% పెరిగాయి. ⇒ ఔత్సాహిక చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ. 20 వేల కోట్ల మూల నిధితో ముద్ర బ్యాంక్‌ను ప్రారంభించాం. ⇒ చేనేత సంఘాలు ఇప్పటివరకు రూ. 60 లక్షల వరకు రుణ సాయం పొందుతుండగా, ఆ మొత్తాన్ని రూ. 2 కోట్లకు పెంచాం. ⇒ మనం ధరిస్తున్న వస్త్రాల్లో 15% మాత్రమే చేనేతవి. ఆ శాతాన్ని మరొక్క 5% పెంచితే.. చేనేత రంగం 33% అభివృద్ధి సాధిస్తుంది. -
సినీ తారలకు మోదీ పిలుపు
చెన్నై: సినిమా తారలు, యువత చేనేత ఉత్పత్తులు వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను వాడటం ద్వారా ఈ రంగానికి ప్రాచుర్యం కల్పించాలని కోరారు. శుక్రవారం చెన్నైలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో మోదీ పాల్గొన్నారు. మద్రాస్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. 'సినిమా నటులు తమ ప్రతి ఐదు సినిమాల్లో ఒక చిత్రంలో చేనేత, చేతి ఉత్పత్తులు వాడితే.. ఈ సినిమాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ఫ్యాషన్‌కు ప్రాచుర్యం కల్పించడంలో సినీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది' అని అన్నారు. ప్రస్తుతం యువత ఎక్కువగా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తున్నారని, చేనేత వస్త్రాలను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. మార్కెట్లో చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరముందని మోదీ అన్నారు. చెన్నైకు వచ్చిన మోదీకి విమానాశ్రయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వాగతం పలికారు. జయ ఆహ్వానం మేరకు మోదీ ఆమె నివాసానికి విందుకు వెళ్లారు.