యువత చేనేత ధరించాలి!
జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ
సాక్షి, చెన్నై: చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆ పథకాల ద్వారా అందే నిధులను చేనేత కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తామని చెప్పారు. తొలి జాతీయ చేనేత దినోత్సవం చెన్నై మద్రాసు యూనివర్సిటీలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. స్వాతంత్య్రోద్యమంలో విదేశీ వస్తు బహిష్కరణ చేసిన రోజును చిరస్మరణీయం చేసేందుకే ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా నిర్ణయించామని తెలిపారు.
చేనేతను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు, చేనేత కార్మికులకు సరైన ప్రతిఫలం లభించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. సినిమాల ద్వారా చేనేత ఉత్పత్తులకు ప్రచారం కల్పించాలని సినీ రంగాన్ని కోరారు. యువత చేనేతను ధరించాలని పిలుపునిచ్చారు. భారతీయ చేనేత పరిశ్రమకు సరైన బ్రాండింగ్ లేదన్నారు. చేనేత ఉత్పత్తులు ఈ కామర్స్‌ను ఉపయోగించుకుని తద్వారా ప్రపంచ మార్కెట్‌కు చేరాలని సూచించారు.
ఈ కార్యకమాన్ని చెన్నైలో నిర్వహించడంపై స్పందిస్తూ.. జాతీయ ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమాలను ఢిల్లీలో కాకుండా దేశంలోని వేరువేరు ప్రాంతాల్లో నిర్వహించాలన్నది తన ప్రభుత్వ ఆలోచన అని వెల్లడించారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మోదీ ప్రసంగించారు. 2012-14 మధ్యకాలంలో చేనేత రంగంలో అద్భుత నైపుణ్యం ప్రదర్శించిన 72 మందికి ప్రధాని అవార్డులు ప్రదానం చేశారు. 16 మంది సంత్ కబీర్ అవార్డు కింద రూ.6 లక్షల నగదు, బంగారు పతకం, ప్రశాంసాపత్రం.. 56 మంది జాతీయ అవార్డుల కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం అందుకున్నారు. సీఎం జయ సందేశాన్ని మంత్రి పన్నీర్ సెల్వం చదివి వినిపించారు.
ఈ సందర్భంగా మోదీ.. ‘ఇండియా హ్యాండ్లూమ్’ చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య, కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్‌కుమార్ కంగ్వార్, కేంద్ర నౌకాయాన మంత్రి పొన్ రాధాకృష్ణన్, తమిళనాడు రాష్ట్ర మంత్రులు పన్నీర్‌సెల్వం, గోకుల ఇందిర, దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు పాల్గొన్నారు.
మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
⇒ చేనేతలో సృజనాత్మక డిజైన్లకు, బ్రాండ్ల రూపకల్పనకు టెక్స్‌టైల్ శాఖ పురస్కారాలందించాలి.
⇒ ఖాదీ ధరించాలన్న తన గత సంవత్సర పిలుపుతో ఖాదీ అమ్మకాలు 60% పెరిగాయి.
⇒ ఔత్సాహిక చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూ. 20 వేల కోట్ల మూల నిధితో ముద్ర బ్యాంక్‌ను ప్రారంభించాం.
⇒ చేనేత సంఘాలు ఇప్పటివరకు రూ. 60 లక్షల వరకు రుణ సాయం పొందుతుండగా, ఆ మొత్తాన్ని రూ. 2 కోట్లకు పెంచాం.
⇒ మనం ధరిస్తున్న వస్త్రాల్లో 15% మాత్రమే చేనేతవి. ఆ శాతాన్ని మరొక్క 5% పెంచితే.. చేనేత రంగం 33% అభివృద్ధి సాధిస్తుంది.