చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి: వైవీ సుబ్బారెడ్డి | ysrcp mp yv subbareddy met jaitley, exemption from GST on handloom products | Sakshi
Sakshi News home page

చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి: వైవీ సుబ్బారెడ్డి

Published Tue, Jul 11 2017 8:22 PM | Last Updated on Mon, May 28 2018 1:52 PM

ysrcp mp yv subbareddy met jaitley,  exemption from GST on handloom products

 ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విన్నపం

న్యూఢిల్లీ: జౌళి రంగంపై ఆధారపడ్డ పేదల జీవనోపాధిని కొనసాగించేలా వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కోరారు. మంగళవారం ఆయన ఈమేరకు జైట్లీని కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘‘టెక్స్‌టైల్స్‌పై 5 శాతం జీఎస్టీ విధించిన నేపథ్యంలో అఖిల భారత టెక్స్‌టైల్‌ సమాఖ్య పలు రాష్ట్రాల్లో జూన్‌ 27, 28, 29 తేదీల్లో బంద్‌ నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బట్టలను పన్ను పరిధిలోకి తేలేదు. పేదలకు సహేతుకమైన ధరల్లో దుస్తులు అందాలన్న ఉద్దేశంతో ఇప్పటివరకు పన్ను పరిధిలోకి తేలేదు. జీవనోపాధి కోసం లక్షలాది మంది వ్యాపారులు, టెక్స్‌టైల్‌ వర్తకులు ఈ రంగంపై ఆధారపడ్డవారు. వీరు పెద్దగా చదువుకున్న వారు కాదు. మహిళలు కూడా వారి భర్తలకు తోడుగా వస్త్రాలు, చీరలు, తదితర దుస్తులు అమ్ముతూ జీవోనోపాధి అందుకుంటున్నారు.

చీరలు, ఇతర వస్త్రాలపై చేతి పని, యంత్రపు పని, ఫినిషింగ్‌ వర్క్‌ వంటి వివిధ పనులు చేస్తూ నిరుపేదలు తమ జీవనోపాధిని సాగిస్తున్నారు. అందువల్ల 5 శాతం జీఎస్టీ విధింపు వల్ల వీరందరినీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సరికాదు. అంతేకాకుండా వీరందరూ తమ లావాదేవీలను నిక్షిప్తం చేస్తూ వారి రిటర్నులను కంప్యూటరీకరణ ద్వారా సమర్పించగలరని ఎలా ఆశించగలం? ఇది సాంకేతికంగా సాధ్యం కాదు. దీని కారణంగా వస్త్ర వ్యాపారులు పూర్వ స్థితిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పూర్వ స్థితికి తేలేని పక్షంలో వారంతా జౌళి రంగంలో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల రానున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై చర్చించి వస్త్రాలపై 5 శాతం జీఎస్టీని తొలగించాలని కోరుతున్నా...’’ అని పేర్కొన్నారు.

గ్రానైట్‌ మెటీరియల్‌ పై జీఎస్టీ రేటును పునఃపరిశీలించాలి.. గ్రానైట్‌ మెటిరియల్‌పై 28 శాతం జీఎస్టీ విధించే అంశంపై పునః పరిశీలించాలని వైవీ సుబ్బారెడ్డి జైట్లీని కోరారు. ఈ అంశంపై మే 27నే లేఖ రాసినట్టు గుర్తు చేశారు. ‘‘కరువు జిల్లా అయిన ప్రకాశం జిల్లా నుంచి నేను ప్రాతినిథ్యం వహిస్తున్నా. ఇక్కడ చిన్నతరహా పరిశ్రమ యూనిట్లుగా గ్రానైట్‌ యూనిట్లు నడుస్తున్నాయి. నాణ్యమైన గ్రానైట్‌ ఎగుమతి అవుతుండగా మిగిలిపోయిన, తిరస్కరణకు గురైన గ్రానైట్‌ తక్కువ రేట్లకు ఇక్కడ అమ్ముతున్నారు. అందువల్ల ఇలాంటి గ్రానైట్‌ మెటిరియల్‌పై కూడా 28 శాతం పన్ను విధించడం సరికాదు. అంతేకాకుండా ఇలాంటి మెటిరియల్‌ను మధ్య తరగతి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు.

ప్రధాన మంత్రి గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో ఈ పరిశ్రమలపై నిరుపేదలు జీవనోపాధి కోసం ఆధారపడుతున్నారు. ప్రభుత్వం 28 శాతం పన్ను విధిస్తే డిమాండ్‌ తగ్గి ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. గ్రానైట్‌ పరిశ్రమ ఇప్పటికే కృత్రిమ గ్రానైట్, సెరామిక్‌ కారణంగా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. అందువల్ల ఈ పరిశ్రమ మనగడ సాధించాలంటే 28 శాతం జీఎస్టీ నుంచి 5 శాతం జీఎస్టీ పరిధిలోకి తేవాలని పరిశ్రమ కోరుతోంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్ణయం వెలువరించాలని కోరుతున్నా..’’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement