కృష్ణాజిల్లా రాయవరం గ్రామంలో మంగళగిరిచీరలకు పట్టును తయారీని చేస్తున్న మహిళ విజయలక్ష్మి
సాక్షి, అమరావతి: చేనేత రంగం పూర్వవైభవం సంతరించుకుంటోంది. స్వదేశీ నినాదం ఊపందుకోవడంతో దేశవ్యాప్తంగా చేనేతకు క్రేజ్ పెరుగుతోంది. ప్రతి భారతీయుడు కొనుగోలు చేసే దుప్పట్లు, టవల్స్, కర్టెన్లు, గలీబులు, చీరలు, ప్యాంట్లు, షర్టులు వంటి వస్త్రాల్లో కనీసం 15 నుంచి 20 శాతం చేనేత కార్మికులు తయారు చేసినవి వాడగలిగితే.. ఆ రంగానికి ఊతమిచ్చినట్టేననే బలమైన నినాదం ప్రజల్లోకి వెళ్లింది.
మన ప్రాచీన సాంస్కృతిక సంపద, వారసత్వం నిరంతరం జీవించగలిగేలా చేనేత రంగానికి ఊతమిచ్చే చర్యలు ఇటీవల దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్నాయి. అన్నిటికన్నా మిన్నగా ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అంతేకాకుండా చేనేత రంగానికి ఊతమిచ్చే అనేక చర్యలు చేపట్టింది. ఫలితంగా దేశవ్యాప్తంగా తెలుగు చేనేత కార్మికులు మార్కెట్‌లో పోటీ పడుతున్నారు.
చేనేత పేరు పలకగానే.. పట్టుపావడా కుచ్చిళ్లు కాళ్లకు అడ్డం పడుతున్నా పరుగులు ఆపని పకపక నవ్వుల పాపాయి గుర్తు రాకుండా ఎలా ఉంటుంది. ఐలారం.. చీరాల పేరాల సుతిమెత్తని చీరల్లో అమ్మ మడతపెట్టి తెచ్చిన పుట్టింటి జ్ఞాపకాలు ఎలా మరిచిపోగలం. చేనేత మాటెత్తగానే.. వెంకటగిరి జరీ వెలుగులు..
మంగళగిరి ఫ్యాన్సీ జిలుగులు.. ఉప్పాడ.. ధర్మవరం పట్టుచీరలు, పావడాలు.. పొందూరు ఖద్దరు.. పెడన కలంకారీ అద్దకాలు.. గూడవల్లి చావిట్లో మగ్గం చప్పుళ్లు.. రాజోలు, అంబాజీపేట వాకిళ్లలో గంగాళాల్లో నానబోసిన రంగురంగుల దారాల కండెలు.. ఇంటిముందు రంగులద్దిన తడి నూలు ఆరబోతలు.. పడుగు–పేకల కలబోతతో నాజూకు కలనేత కళ్లముందు ఇట్టే కదలాడుతాయి.
ఏపీలో అద్భుత నేత
► ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో చేనేత కేంద్రాలు అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. ఒక్కో చోట ఒక్కోతరహా అద్భుతమైన నేతతో ఆకట్టుకుంటున్నాయి.
► పెడన, మచిలీపట్నంలలో సహజసిద్ధంగా తయారు చేసిన రంగులతో కాంతులీనే అద్దకం వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. స్థానికంగా ఉండే చెట్లు, పువ్వుల నుంచి రంగుల సారం, బంక మన్ను, నదులలోని ఇసుక నుంచి రసాయనాలు తయారు చేసి వాటిని వస్త్రాలకు బ్లాక్ ప్రింట్స్‌తో అద్దకం చేసే మన కళాకారులు అనేక అవార్డులను సైతం దక్కించుకున్నారు.
► వెంకటగిరి జరీ, మంగళగిరి ఫ్యాన్సీ, పట్టు చీరలు, కాటన్ వస్త్రాలు, పెడన కలంకారీ అద్దకాలు, పొందూరు ఖద్దరు వంటి అనేక ప్రత్యేకతలు మన రాష్ట్రంలోని చేనేత కళాకారుల సొంతం.
► శ్రీకాళహస్తిలో హ్యాండ్ ప్రింట్స్ (చేత్తో గీసే డిజైన్లు) ప్రత్యేకం. వారి కళా నైపుణ్యానికి జాతీయ అవార్డులు సైతం దక్కాయి.
► ఉప్పాడ జాందాని జరీ చీరలు, ధర్మవరం కాటన్, పట్టు చీరలకు ప్రత్యేకం. బ్లాక్–ప్రింట్స్(కలంకారీ) చేనేతలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ఘనమైనది.
ఒక్కో చోట.. ఒక్కో రకం
భారతదేశంలో దాదాపు 150 చేనేత ఉత్పత్తి కేంద్రాలు ఉన్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్థారించింది. వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మైసూరు, ఒడిశా,బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, సూరత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లోని అనేక చేనేత కేంద్రాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైన నేత ప్రత్యేకం. ఇక్కత్, జాందాని, పట్టు, జరీ చీరలు టై–డై కలంకారీ, పుల్కారి, ఢకై, బాలుచరి సిల్క్, మూగా సిల్క్, పటోల డిజైన్, చందేరి సిల్క్, పైథాని సిల్క్, కోటా పేపర్ సిల్క్, టసర్ సిల్క్, ఖాదీ సిల్క్, మైసూరు సిల్క్, కాశ్మీర్ సిల్క్, ఎరిముడి సిల్క్, కాశ్మీర్ పష్మినా, శాహ్తూష్ పల్చని ఉన్ని వంటి ఉత్పత్తులకు నిరంతరం డిమాండ్ ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల గిరిజన జాతులు రకరకాల చిహ్నాల రంగుల వస్త్రాలు, బిహార్ మధుబని, మహారాష్ట్ర వర్లి డిజైన్లతోపాటు ఆయా రాష్ట్రాల సంప్రదాయ దుస్తులకు చేనేత ఊతమిస్తోంది.
నిత్య నూతన డిజైన్లతో..
నిత్య నూతనమైన డిజైన్లతో చేనేత సంప్రదాయం కొత్త పుంతలు తొక్కుతోంది. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను బట్టి.. మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా చేనేత కళాకారులు నైపుణ్యాలను పెంచుకుంటూ పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకుంటున్నారు. భారతీయ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ఘన చరిత్రే ఉంది. పురాతన కాలం నుంచీ భారతీయ చేనేత వస్త్రాలు ప్రపంచమంతా ఎగుమతి అయ్యేవి. సుమారు 2 వేళ్ల ఏళ్ల క్రితం ‘హంస’ డిజైన్లతో కూడిన భారతీయ వస్త్రాలు ఈజిప్టులోని కైరో నగరంలో లభ్యమయ్యాయి.
అగ్గిపెట్టెలో పట్టే మస్లిన్ చీరలను నేసిన ఘనత కూడా భారతీయులదే. 1905 ఆగస్టు 7న కోల్‌కతాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభం కాగా.. విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చిన స్వాతంత్య్ర ఉద్యమకారులు చేనేత తదితర స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని పిలుపునిచ్చారు. దేశంలో కుటీర పరిశ్రమగా భాసిల్లుతున్న చేనేత రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 70 లక్షల మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నట్టు అంచనా. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న చేనేత ఉత్పత్తుల్లో 90 శాతం మన దేశానికి చెందినవే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment