నాడు-నేడు పురోగతిపై సీఎం జగన్‌ సమీక్ష | Manabadi Nadu Nedu Second Phase Will Start On January 2021 | Sakshi
Sakshi News home page

మనబడి నాడు-నేడు: సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Tue, Aug 4 2020 3:37 PM | Last Updated on Tue, Aug 4 2020 9:12 PM

Manabadi Nadu Nedu Second Phase Will Start On January 2021 - Sakshi

సాక్షి, అమరావతి: మనబడి – నాడు నేడు రెండోదశ కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్దమవుతోంది. మొదటి దశలో దాదాపు 15 వేల పాఠశాలలకు మహర్దశ పట్టగా.. రెండో దశలో మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలను బాగు చేయనున్నారు. నాడు నేడు కార్యక్రమం పురోగతిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ‌సమీక్ష నిర్వహించారు. రెండో దశ పనులకు సంబంధించి కీలక ఆదేశాలిచ్చారు. 

తొలిదశ ప్రగతిని వివరించిన అధికారులు
మనబడి – నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తొలిదశలో పలు స్కూళ్లలో చేపట్టిన పనులను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు సమావేశంలో చూపారు. కృష్ణా జిల్లా కంకిపాడు పంచాయితీలోని కొలవెన్నులో 1938లో కట్టిన ఒక పాఠశాలను కూల్చేయాలని తల్లిదండ్రుల కమిటీ నిర్ణయించగా, నాడు–నేడులో పూర్తి రూపురేఖలు మార్చారు. దీనికి అందరి నుంచి ప్రశంసలు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. స్కూలుకు సంబంధించి నాడు – నేడు పరిస్థితులను వివరించారు. దాంతో పాటు, వైఎస్సార్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రాపురం మండల పరిషత్‌ పాఠశాల, విశాఖ జిల్లా గిడిజాల జడ్పీహెచ్‌ఎస్‌ ఫోటోలను కూడా ప్రదర్శించారు. వీటితో పాటు మరికొన్ని పాఠశాల్లో నాడు నేడు కింద చేసిన మార్పులను కూడా అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు
అన్ని స్కూళ్లలో పిల్లలకు పరిశుభ్రమైన తాగు నీరు అందించేలా మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్లాంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా, వాటి నిర్వహణ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఆ బాధ్యతను కంపెనీలకు అప్పగించాలని నిర్దేశించారు. రెండు నెలల్లో వాటిని ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొనగా, సకాలంలో వాటి ఏర్పాటు పూర్తి కావాలని సీఎం ఆదేశించారు.
(చదవండి: స్పెషల్‌ పోక్సో కోర్టు సంచలన తీర్పు)

రెండు, మూడో దశ పనులు
మనబడి నాడు–నేడు కార్యక్రమంలో మిగిలిన 31,073 స్కూళ్లు, విద్యా సంస్థల్లో దాదాపు రూ.7700 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాల్సి ఉందని సమావేశంతో అధికారులు వెల్లడించారు. రెండో దశలో 14,584 స్కూళ్లు, విద్యా సంస్థల్లో పనులకు రూ.4732 కోట్లు వ్యయం కానుందని, ఈ నెలాఖరులోగా ఆయా స్కూళ్లు, విద్యా సంస్థలను గుర్తించి, వచ్చే ఏడాది జనవరి 14న పనులు ప్రారంభించి జూన్‌నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎంకు తెలిపారు. అదే విధంగా మూడో దశలో 16,489 స్కూళ్లు, విద్యా సంస్థల్లో రూ.2969 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి వాటన్నింటిని గుర్తించి, నవంబరు 14, 2021 నుంచి∙పనులు ప్రారంభించి మార్చి 31, 2022 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
    
ఆకర్షణీయంగా ఉండాలి
నాడు నేడు పనులన్నీ షెడ్యూల్‌ ప్రకారం కొనసాగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందమైన వాల్‌ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని, విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్‌ ఉండాలని ఆదేశించారు. ప్రతి క్లాస్‌ రూమ్‌లో అన్ని రంగుల టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. నాడు–నేడు కార్యక్రమంలో చేపడుతున్న పనులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోందని సమావేశంలో అధికారులు చెప్పారు. ఈ ఏడాది అడ్మిషన్లకు కూడా అంచనాలకు మించి స్పందన కనిపిస్తోందని వారు తెలిపారు.

హైజీన్‌ కిచెన్లు
మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 9 రకాల మార్పులు చేస్తుండగా, కొత్తగా 10వ అంశంగా కిచెన్‌ను చేర్చారు. సెంట్రలైజ్డ్‌ కిచెన్‌కు సంబంధించిన ప్లాన్లను అధికారులు సమావేశంలో వివరించారు. వీలైనంత త్వరగా వాటిని ఖరారు చేసి, పూర్తి పరిశుభ్రం (హైజీన్‌)గా ఉండేలా నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు.

జగనన్న విద్యా కానుక:
స్కూళ్లు తెరిచే రోజు (సెప్టెంబరు 5)న విద్యార్థులకు ఇవ్వనున్న జగనన్న విద్యా కానుక కిట్‌ను సీఎం వైఎస్‌‌ జగన్‌ పరిశీలించారు. పిల్లలకు ఇచ్చే బ్యాగ్, బుక్స్, నోట్‌ బుక్స్, షూస్, సాక్సులు, యూనిఫామ్‌ క్లాత్‌.. అన్నింటినీ స్వయంగా పరిశీలించిన సీఎం వాటి నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని చెప్పారు. ఈ విషయంలో అధికారుల పనితీరును సీఎం ప్రశంసించారు. వచ్చే నెల 5వ తేదీన స్కూళ్లు తిరిగి తెరవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, అప్పటి వరకు ఈ పనులన్నీ పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. ఆరోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి, ఘనంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. వాటన్నింటిపై అధికారులు మరింత ఫోకస్‌ పెట్టాలని నిర్దేశించారు.  విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌తో పాటు, విద్యా శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
(ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement