సాక్షి, అమరావతి: కృష్ణానదిలో సహజసిద్ధ ప్రవాహం నిలిచిపోయింది. అంటే.. ఈ నీటి సంవత్సరంలో వరద ప్రవాహం ముగిసినట్టు లెక్క. (నీటి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు) ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయంలోకి 1,789.810 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గతేడాది శ్రీశైలంలోకి 1,673.66 టీఎంసీల ప్రవాహం రావడం గమనార్హం. మొత్తమ్మీద శ్రీశైలంలోకి 15 ఏళ్ల తర్వాత గరిష్ట వరద ఈ ఏడాదే వచ్చింది. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి 1,278.12 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. గతేడాది ప్రకాశం బ్యారేజీ నుంచి 798.29 టీఎంసీలు సముద్రం పాలు కావడం గమనార్హం.
దశాబ్దం తర్వాత వరుసగా రెండేళ్లు కృష్ణానదికి గరిష్ట వరద ప్రవాహం వచ్చింది. పశ్చిమ కనుమల్లోనూ నదీ పరీవాహక ప్రాంతంలోనూ ఈ ఏడాది భారీవర్షాలు కురవడంతో కృష్ణమ్మ వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కింది. గతేడాది నదీ పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఈ ఏడాది వరద ప్రవాహంతోపాటు.. సహజసిద్ధ ప్రవాహం కూడా పెరిగింది. ఈ ఏడాది కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి 714.15 టీఎంసీలు, నారాయణపూర్ డ్యామ్‌లోకి 717.18 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కృష్ణా ప్రధాన ఉపనది అయిన భీమా నుంచి మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యామ్‌లోకి 124.13 టీఎంసీల ప్రవాహం వచ్చింది. నారాయణపూర్, ఉజ్జయిని డ్యామ్‌ల నుంచి విడుదల చేసిన ప్రవాహం, వాటికి దిగువన నదిలోకి చేరిన వరదతో జూరాల ప్రాజెక్టులోకి 1,300.80 టీఎంసీలు వచ్చాయి.
కృష్ణా మరో ప్రధాన ఉపనది అయిన తుంగభద్ర నుంచి తుంగభద్ర డ్యామ్‌లోకి 289.66 టీఎంసీల ప్రవాహం వచ్చింది. జూరాల ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్ నుంచి దిగువకు విడుదల చేసిన నీరు, వాటికి దిగువన కురిసిన వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి 1,789.810 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన ప్రవాహం, దాని దిగువ కురిసిన వర్షాల ప్రభావం వల్ల నాగార్జునసాగర్‌లోకి 1,302.77 టీఎంసీలు, పులిచింతలలోకి 1,107.78 టీఎంసీల నీరు వచ్చింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన ప్రవాహానికి దాని దిగువన బేసిన్‌లో కురిసిన వర్షాల వల్ల వచ్చిన వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తింది. కృష్ణా డెల్టాకు మళ్లించగా మిగులుగా ఉన్న 1,278.12 టీఎంసీల ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేశారు. 15 ఏళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజీ నుంచి గరిష్ట స్థాయిలో కృష్ణా వరద జలాలు సముద్రంలో కలవడం ఇదే తొలిసారి.
శ్రీశైలం @ 1,789.81 టీఎంసీలు
Published Mon, Feb 1 2021 5:17 AM | Last Updated on Mon, Feb 1 2021 5:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment