ప్రదీప్ పెంచుతున్న కోడిపుంజు
సాక్షి, అమరావతి: ఎంబీఏ చేశాడు... కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. నెలకు రూ.లక్ష జీతం.. వారానికి ఐదు రోజులే ఉద్యోగం.. ఇంతకు మించి ఎవరైనా ఈ రోజుల్లో కోరుకునేది ఏముంటుంది?. కానీ, అతను అలా అనుకోలేదు. వీకెండ్‌లో నాటుకోళ్ల వ్యాపారం షురూ చేశాడు. తర్వాత ఏకంగా ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం పైనే దృష్టి పెట్టాడు. అది ఇప్పుడు రూ.2 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదగడమే కాదు.. పలువురికి ఉపాధి కల్పిస్తోంది. నాటుకోళ్ల పెంపకంలో గుర్తింపు పొందిన ఈ యువకుడి పేరు ప్రదీప్. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నున్న గ్రామవాసి.
ఎంబీఏ చేసిన ప్రదీప్.. ఓ కార్పొరేట్ కంపెనీలో ఏపీ ఏరియా సేల్స్ మేనేజర్‌గా ఉద్యోగం చేసేవాడు. వీకెండ్‌లో కోళ్ల పెంపకంలో గడిపేవాడు. ఆసక్తి పెరగడంతో ఉద్యోగాన్ని వదిలి గుంటకోడూరులో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టాడు. మార్కెటింగ్ ఇబ్బందులతో మొదట ఆదాయం తక్కువగా ఉండేది. దీంతో సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు. వ్యాపారం పెరగడంతో నున్నలో ప్రదీప్ ఫామ్స్ అండ్ హేచరీస్‌తో పాటు చికెన్ వరల్డ్ కంపెనీని ప్రారంభించాడు. నాటుకోళ్లు, కడక్‌నాథ్ కోళ్లు, సిల్కీ, బీవీ 380, ఆర్‌ఐఆర్ జాతులతో పాటు టర్కీ, గిన్నికోళ్లు బాతుల పెంపకాన్ని షురూ చేశాడు. ప్రస్తుతం ఈ ఫామ్‌లో వేయికి పైగా కడక్‌నాథ్ కోళ్లు, 2వేలకు పైగా ఇతర జాతులున్నాయి.
కోళ్ల పెంపకం చేస్తున్న ప్రదీప్
కొత్తగా పందెం కోళ్ల ఫ్యాక్టరీ...
తాజాగా ప్రదీప్ పందెం కోళ్ల ఫ్యాక్టరీని ప్రారంభించాడు. ఫిలిప్పీన్స్ పెరువియన్ జాతి కోళ్లను దిగుమతి చేసుకోవడమే కాదు.. దేశీయ పందెం కోళ్లతో క్రాసింగ్ చేయించి పెరు కోళ్లను అభివృద్ధి చేస్తున్నాడు. వీటికి బలం, వాయువేగం ఎక్కువ. వీటి గుడ్డును రూ.3 వేలకు విక్రయిస్తుండగా, రసంగి, గేరువా, సీతువా, వైట్‌నాట్, బ్లాక్‌నైట్ వంటి పెరువియన్ జాతి కోడిపుంజుల ధర అయితే రూ.3 లక్షల పైమాటే. ఈ ఫ్యాక్టరీలో సుమారు 3 వేలకు పైగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువ చేసే పందెం కోళ్లున్నాయి. కోళ్ల పెంపకానికి ముందుకొచ్చే యువతకు 30 శాతం సబ్సిడీతో కోళ్లను ఇవ్వనున్నట్లు చెప్పాడు.
విదేశాలకు రవాణా
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాలకు డెలివరీ చేస్తున్నారు. ఇటీవలే పాకిస్తాన్, నేపాల్ దేశాలకూ 500 కడక్‌నాథ్ కోడి పిల్లలను ఎగుమతి చేశారు. కోళ్లతో పాటు అంతరించిపోతున్న దేశీయ కుక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జర్మన్ షిపర్డ్, లేబర్, ముథోల్, డాబర్‌మెన్ వంటి జాతులతో పాటు అంతరించిపోతున్న జాతులకు చెందిన రాజపాలయం, జోనంగి జాతి కుక్కలను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా 50 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న ప్రదీప్ ఫామ్స్ పరోక్షంగా మరో వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారి కోసం ప్రతీ మంగళవారం అవగాహన కల్పిస్తున్నారు. ప్రదీప్‌కు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డు కూడా ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment