
సాక్షి, అమరావతి: వచ్చే నెల 15వ తేదీకల్లా సమగ్ర పరిశ్రమ సర్వే పూర్తి చేయాలని పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన సర్వే తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని 4వ బ్లాక్‌లో ఉన్న తన ఛాంబర్‌లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై మంత్రి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. స్కిల్ కాలేజీలు, యూనివర్శీటీల ఏర్పాటు పనులపై అధికారులతో చర్చించారు.
ఈ క్రమంలో ఇరవై స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు వెల్లడించగా.. మరో 5 కాలేజీలకు కేటాయింపులో ప్రస్తుత పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీతో పాటు విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాలో ముందుగా స్కిల్ కాలేజీల ప్రారంభం విషయంలో సమాలోచనలు చేశారు. డిసెంబరులో నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్డీసీ సీఈవో, ఎండీ అర్జా శ్రీకాంత్ ,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment