సాక్షి, అమరావతి: గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ పెట్టి 31మంది మృతికి కారకుడైన చంద్రబాబు... కృష్ణా పుష్కరాల సమయంలో అత్యంత దారుణంగా విజయవాడలో 23 ఆలయాలను కూల్చివేశారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు ఆలయాలను కూల్చితే... సీఎం పునర్ నిర్మిస్తున్నారని, త్వరలోనే విజయవాడలో కొత్త ఆలయాలు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.
‘దేవాలయాల అభివృద్ధి–ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు’పై శాసన మండలిలో సోమవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు ప్రస్తావించిన పలు అంశాలతోపాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. హిందూ ధర్మం ఒక మతం కాదని, మన జీవనశైలి అని అన్నారు. సనాతన సంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని భావితరాలకు అందించాలనే మహోన్నత ఆశయంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
దేవదాయశాఖ పరిధిలో ఉన్న 23,001 దేవాలయాలు, 1,742 ధార్మిక సంస్థలు, 133 మఠాల పవిత్రతను కాపాడేందుకు, ఆస్తులను పరిరక్షించేందుకు సీఎం జగన్ విప్లవాత్మక చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 32 ప్రముఖ ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశామని, భక్తులకు సౌకర్యాల కోసం అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల కాలనీల్లో రూ.296.20కోట్లతో 2,962 నూతన ఆలయాలను రెండు దశల్లో నిర్మిస్తున్నట్లు వివరించారు.
టీటీడీలో 6,700 మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పటికే 3,518 మందికి రూ.313కోట్లతో ఇళ్ల పట్టాలను సీఎం జగన్ చేతుల మీదుగా పంపిణీ చేశామన్నారు. తిరుమలలో సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కును పునరుద్ధరించామన్నారు. టీడీపీ హయాంలో దేవాలయాల పవిత్రతను దెబ్బతీశారని, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఏకంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని తెలిపారు. కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరలను సైతం మాయం చేశారని పేర్కొన్నారు.
దేవదాయ భూముల పరిరక్షణకు పెద్దపీట
‘‘ఒక్కసారి దేవదాయ భూమిగా ప్రకటించిన తర్వాత వాటిని విక్రయించే అవకాశం ఉండదు, రాష్ట్రంలోని దేవదాయ భూముల రక్షణ కోసం 1987లో సెక్షన్–83ని సవరిస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ అమల్లోకి తీసుకొచ్చాం. దీనికి సంబంధించిన బిల్లును త్వరలోనే ప్రవేశపెడుతున్నాం. కొత్తగా గుర్తిస్తున్న దేవదాయ భూములను ఎప్పటికప్పుడు నిషేధిత జాబితాలో చేరుస్తున్నాం. తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులకు పూర్తి రక్షణ కల్పించే విధంగా పలు చర్యలు తీసుకున్నాం’’. అని మంత్రి తెలిపారు. ఈ చర్చలో ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, సత్యనారాయణరాజు, కల్పలత, పాకలపాటి రఘువర్మ, తోట త్రిమూర్తులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment