Development of temples
-
చంద్రబాబు ఆలయాలు కూలిస్తే... జగన్ నిర్మిస్తున్నారు
సాక్షి, అమరావతి: గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ పెట్టి 31మంది మృతికి కారకుడైన చంద్రబాబు... కృష్ణా పుష్కరాల సమయంలో అత్యంత దారుణంగా విజయవాడలో 23 ఆలయాలను కూల్చివేశారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు ఆలయాలను కూల్చితే... సీఎం పునర్ నిర్మిస్తున్నారని, త్వరలోనే విజయవాడలో కొత్త ఆలయాలు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ‘దేవాలయాల అభివృద్ధి–ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు’పై శాసన మండలిలో సోమవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు ప్రస్తావించిన పలు అంశాలతోపాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. హిందూ ధర్మం ఒక మతం కాదని, మన జీవనశైలి అని అన్నారు. సనాతన సంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని భావితరాలకు అందించాలనే మహోన్నత ఆశయంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవదాయశాఖ పరిధిలో ఉన్న 23,001 దేవాలయాలు, 1,742 ధార్మిక సంస్థలు, 133 మఠాల పవిత్రతను కాపాడేందుకు, ఆస్తులను పరిరక్షించేందుకు సీఎం జగన్ విప్లవాత్మక చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 32 ప్రముఖ ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశామని, భక్తులకు సౌకర్యాల కోసం అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల కాలనీల్లో రూ.296.20కోట్లతో 2,962 నూతన ఆలయాలను రెండు దశల్లో నిర్మిస్తున్నట్లు వివరించారు. టీటీడీలో 6,700 మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పటికే 3,518 మందికి రూ.313కోట్లతో ఇళ్ల పట్టాలను సీఎం జగన్ చేతుల మీదుగా పంపిణీ చేశామన్నారు. తిరుమలలో సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కును పునరుద్ధరించామన్నారు. టీడీపీ హయాంలో దేవాలయాల పవిత్రతను దెబ్బతీశారని, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఏకంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని తెలిపారు. కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరలను సైతం మాయం చేశారని పేర్కొన్నారు. దేవదాయ భూముల పరిరక్షణకు పెద్దపీట ‘‘ఒక్కసారి దేవదాయ భూమిగా ప్రకటించిన తర్వాత వాటిని విక్రయించే అవకాశం ఉండదు, రాష్ట్రంలోని దేవదాయ భూముల రక్షణ కోసం 1987లో సెక్షన్–83ని సవరిస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ అమల్లోకి తీసుకొచ్చాం. దీనికి సంబంధించిన బిల్లును త్వరలోనే ప్రవేశపెడుతున్నాం. కొత్తగా గుర్తిస్తున్న దేవదాయ భూములను ఎప్పటికప్పుడు నిషేధిత జాబితాలో చేరుస్తున్నాం. తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులకు పూర్తి రక్షణ కల్పించే విధంగా పలు చర్యలు తీసుకున్నాం’’. అని మంత్రి తెలిపారు. ఈ చర్చలో ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, సత్యనారాయణరాజు, కల్పలత, పాకలపాటి రఘువర్మ, తోట త్రిమూర్తులు మాట్లాడారు. -
దశల వారీగా దేవాలయాల అభివృద్ధి : మంత్రి వెల్లంపల్లి
శ్రీకాకుళం: జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించబడిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లా సందర్శనలో భాగంగా మంగళవారం ఉదయం రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాసుతో కలసి ఆరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను అర్చకులు శంకర శర్మ మంత్రికి వివరించారు. స్వామి వారి దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని రాబోయే ఐదు సంవత్సరాల్లో జిల్లాను అభివృద్ధి చేసి చూపుతామన్నారు. రాష్ట్రంలో దశల వారీగా దేవాలయాలు అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవాలయాల అభివృద్ధిలో భాగంగా అరసవెల్లి , శ్రీకూర్మం దేవాలయాలను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభమయిందన్నారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాసు కోరిన విధంగా త్వరలోనే శ్రీకూర్మంలో నిత్యఅన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో దశల వారీగా దేవాలయాలు, టూరిజం వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. -
రెండూ రోజూ కొనసాగిన అవగాహన కార్యక్రమం
అన్నవరం: రాష్ట్ర దేవాలయ పాలనాసంస్థ (సీట) ఆధ్యర్యంలో అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై విష్ణుసదన్ సత్రంలో నిర్వహిస్తున్న ‘ఆలయాల అభివృద్ధిపై వ్యవస్థాపక ధర్మకర్తలకు అవగాహన’ కార్యక్రమం రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఈ కార్యక్రమానికి సీట డెరైక్టర్ సీహెచ్ విజయ రాఘవాచార్యులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిధిగా ఈఓ కె. నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆలయాల అభివృద్ధిలో ధర్మకర్తలు ఏ విధంగా వ్యవహరించాలి, ప్రభుత్వం నుంచి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు లభిస్తాయి తదితర విషయాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రసంగాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ధర్మకర్తల విధులకు సంబంధించిన ‘సీట’ ముద్రించిన బుక్లెట్లను పంపిణీ చేశారు. సీట డిఫ్యూటీ డెరైక్టర్ చంద్రశేఖరరావు, విశ్రాంతి ఏసీ ప్రకాశరావు, దేవస్థానం పీఆర్ఓ తులా రాము, జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన వ్యవస్థాపక ధర్మకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం ఉదయం జరిగే కార్యక్రమంతో ఈ సమావేశాలు ముగుస్తాయి.