![Development Of Temples Step By Step- Minister Vellampalli Srinivasa Rao - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/9/Vellampalli-Srinivasa-Rao.jpg.webp?itok=q2BU2qYm)
శ్రీకాకుళం: జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా నియమించబడిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ మొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. జిల్లా సందర్శనలో భాగంగా మంగళవారం ఉదయం రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాసుతో కలసి ఆరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయంగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ విశిష్టతను అర్చకులు శంకర శర్మ మంత్రికి వివరించారు.
స్వామి వారి దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని రాబోయే ఐదు సంవత్సరాల్లో జిల్లాను అభివృద్ధి చేసి చూపుతామన్నారు. రాష్ట్రంలో దశల వారీగా దేవాలయాలు అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
దేవాలయాల అభివృద్ధిలో భాగంగా అరసవెల్లి , శ్రీకూర్మం దేవాలయాలను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ ప్రారంభమయిందన్నారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాసు కోరిన విధంగా త్వరలోనే శ్రీకూర్మంలో నిత్యఅన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాలో దశల వారీగా దేవాలయాలు, టూరిజం వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment