
తిరుపతి: తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా మంత్రి ఆర్‌కే రోజా సారె సమర్పించారు. గంగమ్మ ఆలయానికి భారీ ఎత్తున ఊరేగింపుగా వచ్చిన మంత్రి రోజా.. సారెతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడుతూ..‘ గంగమ్మ ఆలయానికి సారె తీసుకురావడం పూర్వజన్మ సుకృతం,అదృష్టంగా భావిస్తున్నా. 900 ఏళ్ల చరిత్ర కల్గిన పురాతన ఆలయం గంగమ్మ తల్లి ఆలయం. గతంలో తిరుమలకు వెళ్ళే భక్తులు గంగమ్మ ను దర్శించుకున్న తర్వాత కొండకు వెళ్ళేవారు. రాష్ట్రం లో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను’ అని పేర్కొన్నారు.
గంగమ్మ జాతరకు ప్రత్యేక కళా బృందాలు: భూమన
మంత్రి రోజా సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంగమ్మ జాతరకు ప్రత్యేక కళా బృందాలతో కార్యక్రమాలు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గంగమ్మ ఆలయం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేందుకు సహకారం అందించాలని కోరినట్లు భూమన పేర్కొన్నారు.