సాక్షి, విజయవాడ: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో కుట్రలు జరుగుతన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఏకగ్రీవాలు జరిగితే లభించే ప్రోత్సాహకాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఏకగ్రీవాలపై ప్రకటన చేస్తే, దానికి దురుద్ధేవాలను ఆపాదిస్తూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్‌ఈసీ ఆధ్వర్యంలో ఏకగ్రీవాలను అడ్డుకొని గ్రామాల్లో ప్రశాంతతకు భగ్నం కలిగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో అధికార పార్టీకి నష్టం కలిగించి, ఇతర పార్టీలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎస్‌ఈసీ పని చేస్తున్నారని, అందులో భాగంగా టీడీపీకి మేలు చేకూర్చేలా సొంత యాప్‌ను కూడా రూపొందించారన్నారు.
ఎస్‌ఈసీ దుందుడుకు చర్యలను ప్రశ్నించిన ప్రభుత్వ సలహాదారును తొలగించమనటం హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారుగా పాలసీలపై మట్లాడే హక్కు సజ్జల రాయకృష్ణారెడ్డికి ఉందని, అసలు ఆయన చేసిని వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. సజ్జలపై ఎస్ఈసీ చేసిన విమర్శలు రాజకీయ విమర్శల్లా ఉన్నాయని, రాజ్యాంగం ముసుగులో నిమ్మగడ్డ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కోసం ఏకగ్రీవాలు చేసుకోవాలని మంత్రులు పిలుపునిస్తే తప్ప పట్టడంలో అర్ధం ఏంటని ప్రశ్నించారు. పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటిస్తే చర్యలు తీసుకోని ఎస్‌ఈసీ.. అధికారులపై తన పరిధి దాటి చర్యలకు పూనుకోవడం ఏంటని నిలదీశారు. ఎస్ఈసీ చేపడుతున్న చర్యలు రాజ్యాంగ చర్యల్లా లేవని, రాజకీయ చర్యల్లా ఉన్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment