సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో చనిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. టీడీపీ దౌర్జన్యకారుల ధాటికి అట్టుడుకుతున్న నిమ్మాడ గ్రామానికి ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే.. నిమ్మగడ్డ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నాడన్న విషయం మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రలోభాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చట్టంలో మౌలిక మార్పులు తెచ్చామని వివరించారు.
స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, నిమ్మాడ ఘటనే ఇందుకు ఉదాహరణ అని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇలాఖా అయిన నిమ్మాడలో ఇంతవరకు స్వేచ్ఛగా నామినేషన్ వేసిన దాఖలాలు లేవని, గతంలో టీడీపీ నేతలను వ్యతిరేకించిన 8 మంది హత్యకు గురయ్యారని గర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అచ్చెన్నాయుడు అతని అనుచరగణం వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన అప్పన్న నామినేషన్ వేయకుండా దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. గతంలో నిమ్మాడలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేశారని గర్తు చేశారు.
చంద్రబాబు చెప్పే ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని సజ్జల నిలదీశారు. విజయవాడ దాడి ఘటనలో టీడీపీ పాత్ర ఉన్నట్టు అనుమానాన్ని వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను పక్కదారి పట్టించేందుకే టీడీపీ నేతలు ఈ డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. బస్సులు తగలబెట్టడం చంద్రబాబు నైజం అని దగ్గుబాటి పుస్తకంలో ప్రస్తావించిన అంశాన్ని సజ్జల ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నేతలు డబ్బులిచ్చి రాజమండ్రిలో విగ్రహ ధ్వంసం చేయించారని, అంబేడ్కర్, రంగా విగ్రహాల ధ్వంసానికి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీలు, కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారన్నారు. ఎస్‌ఈసీ యాప్‌పై అనేక అనుమానాలున్నాయని, దానికి బదులు సీఈసీ యాప్‌ను వాడాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment