సాక్షి, గుంటూరు: ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని.. గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువే గెలుస్తామని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకోవద్దన్నారు.
‘‘చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు. చంద్రబాబు పూర్తిగా నెగిటివ్ క్యాంపెన్ చేశారు. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుప్పంలోనూ వైఎస్సార్‌సీపీ గెలవబోతోంది. కుట్రపూరితంగా కేంద్రం సహాయంతో కొందరు అధికారులను తప్పించారు. ల్యాండ్ టైట్లింగ్‌పై చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హామీలపై ప్రజలకు నమ్మకం లేదు’’ అని సజ్జల పేర్కొన్నారు.
‘‘పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లోని సీసీటీవీలు ధ్వంసం చేయడం అన్యాయం. పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమేంటి?. దాడిపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు.
‘‘కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని అనుకోవడం లేదు.. కౌంటింగ్‌లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటాం. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. ఇప్పటికేనీ ఈసీ తప్పు సరిదిద్దుకుంటే మంచింది’’ అని సజ్జల హితవు పలికారు.
మళ్లీ అధికారంలోకి వస్తున్నాం. సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది. మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న తీరు చూస్తుంటే మళ్ళీ విజయం సాధిస్తాం. పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది. మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు. ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు. వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా. సీఎం జగన్ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు. నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు. టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.
‘‘చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు. టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది. వారు చెప్పిన అధికారులే హింసకు కారణమయ్యారు. ఇప్పుడు వాళ్లనే ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది. ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. పోలింగ్ కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు. అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లే. వీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే. ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్‌కు లేఖలు రాస్తున్నారు. రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు’’ అని సజ్జల ధ్వజమెత్తారు.
‘‘తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?. ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి. టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం. ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాం. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం. జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు. అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం’’ అని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment