
హైదరాబాద్/తాడికొండ: అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన ఆడియో టేపులను ఇష్టారీతిగా ప్రసారం చేస్తూ దళితులను, ఇతర వర్గాల మహిళలను కించపరిచేలా ఏబీఎన్ చానెల్ అధినేత రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారని తాడికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో ‘బ్రీఫ్డ్‌మీ’ అని చంద్రబాబు రూ.5 కోట్ల విషయంలో అడ్డంగా దొరికినప్పుడు దాన్ని ప్రసారం చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి చానెల్‌లో వాటా ఉండటమే దీనికి కారణమన్నారు. తనపై అసత్య ప్రసారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రసారానికి ముందు తమ వివరణ అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాధాకృష్ణను బూతు కిట్టూ అంటుంటే ఎందుకంటున్నారో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు బాగా అర్థమవుతోందన్నారు. మీ చంద్రబాబేమో దళితులుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని అన్నారని, టీడీపీ నేతలేమో దళితులు శుభ్రంగా ఉండరు.. చదువుకోరు అని కించపరిచారని గుర్తుచేశారు. బూతు ప్రసారాలు చేస్తున్నారు కాబట్టే ప్రజలు రాధాకృష్ణకు బూతుకిట్టు అనే బిరుదు ఇచ్చారని దుయ్యబట్టారు. ఇవే ఆడియోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి మీ తల్లినో, చెల్లినో, అక్కనో వెబ్‌సైట్‌లో పెడితే మీరు బాధపడరా అని రాధాకృష్ణను ప్రశ్నించారు. ‘ఏదైనా ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోండి. నాకు వైఎస్ జగన్ రాజకీయ భిక్ష పెట్టారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ కనుమరుగవుతుంది’ అని శ్రీదేవి తీవ్రంగా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment