పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్‌ఎంఈలు | MSMEs to tax paying level | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లించే స్థాయికి ఎంఎస్‌ఎంఈలు

Published Fri, Feb 16 2024 5:33 AM | Last Updated on Fri, Feb 16 2024 6:40 PM

MSMEs to tax paying level - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేగంగా విస్తరిస్తుండటమే కాక అవి ఆదాయ పన్ను చెల్లించే స్థాయికి చేరుకుంటున్నాయి. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలు సంఖ్య గణనీయంగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 2019–20 నుంచి 2022–23 మధ్య కాలంలో రాష్ట్రంలో కొత్తగా 18.3 లక్షల మంది కొత్తగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగడం.. ఎంఎస్‌ఎంఈ రంగానికి పెద్దపీట వేస్తుండడం ఐటీ రిటర్నుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ తర్వాత గడిచిన మూడేళ్ల కాలంలో మహారాష్ట్రలో అత్యధికంగా 13.9 లక్షలు, ఉత్తరప్రదేశ్‌ 12.7 లక్షలు, గుజరాత్‌ 8.8 లక్షలు, రాజస్థాన్‌ 7.9 లక్షలు చొప్పున ఐటీఆర్‌ పెరిగాయి. కానీ, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రిటర్నుల సంఖ్య 11.7 లక్షలు తగ్గడం గమనార్హం.

ఎంఎస్‌ఎంఈలు 1.93లక్షల నుంచి 6.6 లక్షలకు..
ఇక అసంఘటిత రంగంగా ఉన్న ఎంఎస్‌ఎంఈ రంగాన్ని సంఘటితం చేయడానికి కేంద్ర ప్రభుత్వం జూలై 1, 2020న ఎంఎస్‌ఎంఈ యూనిట్ల నమోదు కోసం ఉద్యమ్‌ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకు రుణాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్‌ వంటి అనేక సౌలభ్యాలు ఉండటంతో ఈ పోర్టల్‌లో నమోదు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.

దీంతో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,93,530గా ఉన్న ఎంఎస్‌ఎంఈల సంఖ్య ఇప్పుడు 6.6 లక్షలు దాటినట్లు ఉద్యమ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే, ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ వల్ల దేశవ్యాప్తంగా 2.18 కోట్ల ఎంఎస్‌ఎంఈలు కొత్తగా రిటర్నులు దాఖలు చేయడానికి దోహదపడినట్లు ఎస్‌బీఐ తన రీసెర్చ్‌ నివేదికలో పేర్కొంది.

ఇక మొత్తం పెరిగిన ఐటీఆర్‌ల్లో 60 శాతం తొలి ఐదు రాష్ట్రాల నుంచే వచ్చినట్లు పేర్కొంది. ఇదే సమయంలో రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య 4.1 లక్షలకు దాటడం కూడా రిటర్నులు దాఖలు పెరగడంలో కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ చర్యలవల్ల రానున్న కాలంలో ఈ రిటర్నులు సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ట్యాక్స్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఎంఎస్‌ఎంఈలకు పునరుజ్జీవం..
కోవిడ్‌ సమయంలో సీఎం వైఎస్‌ జగన్‌ రిస్టార్ట్‌ ప్యాకేజీ, వైఎస్సార్‌ నవోదయం వంటి పథకాలతో చేయిపట్టి నడిపించడం ద్వారా ఎంఎస్‌ఎంఈ రంగానికి పునరుజ్జీవం కల్పించడంతో కొత్త యూనిట్లు ప్రారంభించడానికి ముందుకొస్తున్నాయి. గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా ప్రస్తుత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలను విడుదల చేస్తూ ఆదుకుంటోందని పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్‌ మిల్లులకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి వాటిని ఆదుకుంది. ఇప్పుడు తాజాగా ఫిబ్రవరిలో ప్రోత్సాహకాలు విడుదల చేయనుంది. అంతేకాక.. నిర్వహణ వ్యయం తగ్గించి పెద్ద పరిశ్రమలతో పోటీపడేలా క్లస్టర్‌ విధానాన్ని, ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.118 కోట్లతో ‘ర్యాంప్‌’కార్యక్రమాన్ని చేపట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement