హే రామ్‌.. తుఝే సలామ్‌ | Muslim families carving flagpoles for temples | Sakshi
Sakshi News home page

హే రామ్‌.. తుఝే సలామ్‌

Published Sun, Sep 27 2020 4:06 AM | Last Updated on Sun, Sep 27 2020 5:16 AM

Muslim families carving flagpoles for temples - Sakshi

శిల్పకారులు చెక్కిన ధ్వజస్తంభం

సాక్షి, గుంటూరు: ‘రామ్‌ రహీమ్‌ ఏక్‌ హై’ అని శతాబ్దాల క్రితమే గళమెత్తాడు భక్త కబీర్‌దాస్‌. అదే భావంతో.. అదే బాటలో పయనిస్తూ.. హిందూ బంధువుల ఆధ్యాత్మిక చింతనకు ధ్వజాలు ఎత్తుతున్నారు ఈ ముసల్మాన్‌లు. గుంటూరు జిల్లా మాచవరం మండలం తురక పాలెం గ్రామంలోని ముస్లిం శిల్పకారులు ధ్వజస్తంభాలు చెక్కడంలో నేర్పరులు. తరతరాలుగా హిందూ ఆలయాలకు ధ్వజ స్తంభాలను చెక్కే వృత్తిలోనే కొనసాగుతూ.. రాముడైనా.. రహీమ్‌ అయినా తమకొక్కటేనని చాటుతున్నారు.

వంద కుటుంబాలకు ఇదే వృత్తి
► సుమారు వందేళ్ల క్రితం తురక పాలెం గ్రామానికి చెందిన కరీమ్‌ సాహెబ్‌ ధ్వజస్తంభాలు చెక్కడం ప్రారంభించారు. 
► తర్వాతి రోజుల్లో ఆయన కుటుంబీకులతోపాటు గ్రామానికి చెందిన మరికొన్ని ముస్లిం కుటుంబాలు దీనినే వృత్తిగా చేసుకున్నాయి.
► కరీమ్‌ సాహెబ్‌ నాలుగో తరానికి చెందిన కుటుంబాలు కూడా నేటికీ ఇదే వృత్తిలో రాణిస్తున్నాయి. 
► ప్రస్తుతం గ్రామంలో వందకు పైగా కుటుంబాలు శిల్పాలతో కూడిన ధ్వజస్తంభాలు చెక్కుతున్నాయి.

బండల్ని తొలిచి..
► తురకపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లోని క్వారీల్లో పెద్ద పెద్ద బండలను తొలిచి ధ్వజస్తంభం ఆకృతులుగా మలుస్తారు.
► ఒక్కొక్క ధ్వజస్తంభం 20 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. 
► ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి ధ్వజస్తంభాలు సరఫరా అవుతుంటాయి. 
► ధ్వజస్తంభాన్ని చెక్కడం, లారీలోకి ఎక్కించి ఆలయానికి చేర్చే బాధ్యత వీరే చేపడతారు. మార్గమధ్యంలో దురదృష్టవశాత్తూ ధ్వజ స్తంభం విరిగితే మళ్లీ కొత్తది తయారు చేసి అందిస్తారు. 
► ధ్వజస్తంభం ఎత్తును బట్టి అడుగుకు రూ.3,500 నుంచి రూ.4 వేల చొప్పున ధర ఉంటుంది. 
► ఒక్కో స్తంభం చెక్కడానికి 20 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. 

30 ఏళ్లుగా ఇదే వృత్తి
30 ఏళ్లుగా ఇదే వృత్తి చేస్తున్నాను. తాతల నుంచి వస్తున్న వృత్తిని వదిలి వేరే పనికి వెళ్లడానికి మనసు ఒప్పుకోదు. ఆర్థిక ఇబ్బందులున్నా ఈ వృత్తిని ఎంతో ప్రేమతో కొనసాగిస్తున్నాం. ప్రస్తుత తరం వాళ్లు ఈ వృత్తిని చేపట్టడానికి మొగ్గు చూపడం లేదు. మాతోనే ఈ కళ కనుమరుగవుతుందేమో అనే బాధ ఉంది. 
    – షేక్‌ అల్లాబక్షు, శిల్పకారుడు

మా కళను గుర్తిస్తున్నారు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆలయాలు నిర్మించినా.. ఆ కమిటీల వాళ్లు మా కళను గుర్తించి ధ్వజస్తంభం ఆర్డర్‌ ఇవ్వడానికి ఇక్కడకే వస్తారు. మా కళను గుర్తించి వాళ్లు రావడం ఎంతో ఆనందంగా ఉంటుంది. కరోనా నేపథ్యంలో కొత్త ఆలయాల నిర్మాణాలు లేకపోవడంతో ప్రస్తుతం పెద్దగా ఆర్డర్లు లేవు.
    – షేక్‌ పెంటుసా, శిల్పకారుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement