
న్యూఢిల్లీ: ఉత్తరాంధ్ర–ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్న జవాద్ తుపానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను విరుచుకుపడితే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. జవాద్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటినుంచే అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. తుపాన్‌పై సంబంధిత రాష్ట్రాలు, అధికార యంత్రాంగం సన్నద్ధత గురించి ఆరా తీశారు.
విద్యుత్, టెలికమ్యూనికేషన్లు, ఆరోగ్యం, తాగునీరు వంటి అత్యవసర సర్వీసులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. తుపాన్ వల్ల ఈ సేవల్లో అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించాలని చెప్పారు. సరిపడా అత్యవసర ఔషధాల నిల్వలను సిద్ధంగా ఉంచాలన్నారు. తుపాన్ సహాయక కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ చెప్పారు.
జవాద్‌పై కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా కూడా అన్ని తీరప్రాంత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఇక కేంద్ర హోంశాఖ కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్‌ఎఫ్) 29 వరద సహాయ బృందాలను ముందస్తుగానే రంగంలోకి దించింది. మరో 33 బృందాలను సిద్ధంగా ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment