ఉదయగిరి దుర్గం... రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికి జరిగిన పయనంలో ఈ దుర్గం దాటిన మైలురాళ్లు ఒకటి కాదు రెండు కాదు. గజపతుల పాలనకు ముందు విజయనగర పాలకుల స్వాధీనంలో ఉండేది. పల్లవులు, కాకతీయులు, చోళులు, గోల్కొండ, ఆర్కాటు నవాబులతోపాటు బ్రిటిష్ పాలననూ చూసింది. ప్రతి పాలకులూ ఈ దుర్గంలో తమ ఆనవాళ్లను ప్రతిష్ఠించారు. సూర్యుడి తొలికిరణాలు కొండ మీద ప్రసరిస్తాయి కాబట్టి ఉదయగిరి అనే పేరు వచ్చింది.
సుదీర్ఘ యుద్ధం
చోళ సంస్కృతికి ప్రతిబింబంగా రంగనాథ మండపం, పల్లవుల నిర్మాణ శైలికి ప్రతీకగా బాలకృష్ణ మందిరం, విజయనగర రాజుల నిర్మించిన పారువేట మండపం ఉన్నాయి. సూఫీ సన్యాసి చొరవతో నిర్మించిన చిన్న మసీదు, పెద్ద మసీదు, బ్రిటిష్ పాలకులు నిర్మించిన అద్దాల మహల్ ఇక్కడ దర్శనీయ స్థలాలు. ఇక కోట పటిష్ఠత గురించి చెప్పాలంటే... గజపతుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి శ్రీకృష్ణదేవరాయల సైన్యం పద్దెనిమిది నెలలు యుద్ధం చేసింది.
సంజీవని కొండ
ఇక్కడి అడవులు దట్టమైన చెట్లతో ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ అడవుల్లో సంజీవని వృక్షాలున్నాయని ప్రతీతి. మొలతాడు సామి అనే సన్యాసి సంజీవని వృక్షాలను అన్వేషిస్తూ అడవుల్లో తిరుగుతుండేవాడని, వనమ్మ అనే వైద్యురాలు ఇక్కడి అడవుల్లో దొరికే ఔషధాలతో రోగాలు నయం చేసేదని స్థానికంగా కొన్ని కథనాలు వ్యవహారంలో ఉన్నట్లు పోట్లూరు సుబ్రహ్మణ్యం ‘ఉదయగిరి దుర్గం కథలు’లో ఉంది.
సామరస్య సు‘గంధం’
ఉదయగిరి కోట మత సామరస్యానికి వేదిక. ఏటా రబీ ఉల్ అవ్వల్ నెలలో జరిగే గంధం ఉత్సవాన్ని హిందువులు – ముస్లింలు కలిసి పండుగ చేసుకుంటారు. ఉదయగిరి కోట నెల్లూరు నగరానికి వంద కిలోమీటర్ల దూరాన ఉంది. నెల్లూరులో బస చేసి ఉదయం కారులో బయలుదేరితే రెండున్నర గంటల్లో కొండను చేరుకోవచ్చు. కొండ మీద ఉన్న దుర్గం పల్లి గ్రామం, వల్లభరాయ ఆలయం వరకు రోడ్డు ఉంది. అక్కడి నుంచి కోటను చేరడానికి ఉన్నది మెట్ల మార్గమే. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నరకు పర్యాటకులను అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment